విశాఖ ఉక్కు కోసం డిజిటల్ ఉద్యమమా ?

Update: 2021-12-18 04:28 GMT
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది. తానేం చేస్తున్నారో కనీసం తనకైనా అర్ధమవుతోందో లేదో మిగిలిన వాళ్ళకు అర్ధం కావటంలేదు. విశాఖపట్నం ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా డిజిటల్ ఉద్యమం చేయాలని పిలుపినిచ్చారు. డిజిటల్ ఉద్యమం చేస్తే వచ్చే లాభమేమిటో ఆయనకే అర్థం కావాలి. ఇంతకీ ఈ డిజిటల్ ఉద్యమం ఏమిటంటే ఉక్కుఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ, టీడీపీ ఎంపీలకు వాళ్ళ బాధ్యతను గుర్తుచేయాలట.

ట్విట్టర్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి వాటిని రెండుపార్టీల ఎంపీలకు ట్యాగ్ చేయాలట. ట్విట్టర్లో నిరసన పోస్టులు పెట్టి వాటిని వైసీపీ, టీడీపీ ఎంపీలకు ట్యాగ్ చేయడం వల్ల ఏమి జరుగుతుంది ? ఇదే ఇపుడు ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రత్యక్ష పోరాటాలు లేదా పరస్పర సంప్రదింపులు, ఒత్తిళ్ళను మానేసి డిజిటిల్ ఉద్యమని చెప్పటమే విచిత్రంగా ఉంది. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న పవన్ కేంద్రంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించటం మానేసి పిచ్చి చేష్టలన్నీ చేస్తున్నారు.

ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం పవన్ ప్రశ్నించలేదు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకున్నది నరేంద్ర మోడీ సర్కార్ అయితే పవన్ టార్గెట్ చేస్తున్నది మాత్రం జగన్మోహన్ రెడ్డినే. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అధికార పార్టీ ఎంపీలు చేస్తున్న ఆందోళన, నిరసనలు సరిపోవు కాబట్టి మోతాదు పెంచాలని కోరటంలో తప్పులేదు. అంతేకానీ వైసీపీ ఎంపీలు అసలు నిరసనలే చేయటం లేదని అనడం కూడా తప్పే.

ఇప్పటికే ఇదే విషయమై పార్లమెంటులో చర్చించారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్ కూడా ప్రధానమంత్రికి రెండు సార్లు లేఖలు రాశారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపారు. ఇవన్నీ పవన్ కు కనబడలేదు, అర్ధం కావటం లేదంటే ఎవరు ఏమీ చేయలేరు. వీటన్నింటినీ పక్కనపెట్టేసి మిత్ర పక్ష నేత హోదాలో తానే మోడీని కలిసి ప్రైవేటీకరణను నిలిపేసి క్రెడిట్ మొత్తం తానే తీసుకోవచ్చు.

పవన్ ఎప్పుడు మాట్లాడినా ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణలో అసలు కేంద్రం బాధ్యతే లేదంటున్నారు. తన ఫ్యాక్టరీని తాను ప్రైవేటీకరిస్తున్నపుడు అసలు కేంద్రం బాధ్యతే లేదన్నట్లుగా పవన్ ఎలా మాట్లాడుతున్నారో అర్ధం కావటంలేదు. జరుగుతున్నదొకటి, పవన్ మాట్లాడుతున్నది మరొకటి కాబట్టే జనాలు కూడా చాలా లైటుగా తీసుకున్నారు. మొన్న పార్టీ ఆఫీసులో దీక్ష అయిపోయింది. మూడు రోజులు డిజిటల్ ఉద్యమం అంటున్నారు. తర్వాత ఏమంటారో చూద్దాం.


Tags:    

Similar News