బెజ‌వాడ‌లో ప‌వ‌న్ శిబిరం డేట్ ఫిక్స్‌

Update: 2017-10-05 05:29 GMT
కొద్ది వారాల క్రితం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబ‌రు నెల నుంచి తాను రాజ‌కీయాల్లో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు చెప్పారు. త‌న స‌మ‌యంలో మూడొంతులకు పైగా రాజ‌కీయాల్లోకి కేటాయిస్తాన‌ని.. క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని చెప్పుకొచ్చారు. ఆయ‌న చెప్పిన‌ట్లే సెప్టెంబ‌రు పూర్తి అయి.. అక్టోబ‌రులోకి అడుగు పెడుతున్నా.. ఆయ‌న చెప్పిన యాక్టివ్ పాలిటిక్స్ ఇంకా షురూ కాలేద‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే.. తాజాగా జ‌న‌సేన నుంచి ఒక ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. ఏపీలోని యువ‌తీ యువ‌కుల‌కు క్రియాశీల స్థానం క‌ల్పించేందుకు వీలుగా శిబిరాల్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లుగా ప‌వ‌న్ వెల్ల‌డించారు. ఈ నెల 7..8 తేదీల్లో విజ‌య‌వాడ‌లో ఈ శిబిరాల్ని ఏర్పాటు చేస్తామ‌ని చెబుతున్నారు.  ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీకి సేవ‌లు అందించేందుకు వ‌క్త‌లు.. విశ్లేష‌కులు.. కంటెంట్ రైట‌ర్ల‌ను నియ‌మించుకోవాల‌న్న ఆలోచ‌న చేసిన ప‌వ‌న్‌.. అందుకు త‌గ్గ‌ట్లే రిక్రూట్ మెంట్ ప్ర‌క్రియ‌ను షురూ చేశారు.

ఆన్ లైన్ లో వ‌చ్చిన ద‌ర‌ఖాస్తుల్ని ప‌రిశీలించి.. ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో శిబిరాల‌ను ముగించిన జ‌న‌సేన‌.. తాజాగా బెజ‌వాడ‌లోనూ ఔత్సాహికుల‌తో ఒక వేదిక‌ను రూపొందించాల‌ని భావిస్తోంది. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించే స‌ద‌స్సు కోసం ద‌ర‌ఖాస్తు కోసం ఆహ్వానిస్తే 8వేల మంది ద‌ర‌ఖాస్తులు పెట్టుకున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌మ పార్టీకి విశేష‌మైన స్పంద‌న ల‌భిస్తోంద‌ని.. ద‌ర‌ఖాస్తుదారుల‌కు స్పెష‌ల్ థ్యాంక్స్ చెప్పిన ప‌వ‌న్‌.. పార్టీ శిబిరాల‌ను మ‌రో రెండు రోజుల్లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. మ‌రి.. ఈ త‌ర‌హా శిబిరాలు ఎంత‌వ‌ర‌కు వ‌ర్క్ ఆవుట్ అవుతాయ‌న్న‌ది రానున్న రోజులు తేల్చి చెప్ప‌నున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News