టాలీవుడ్ పవర్ స్టార్ - జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ నుంచి ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోయానని తనకు తానే ప్రకటించుకున్నారు. సినిమాల్లో నటిస్తున్న నేపథ్యంలో... 2014 ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీని ప్రారంభించిన పవన్... తనక షూటింగులు లేనప్పుడు మాత్రమే పాలిటిక్స్ వైపు దృష్టి సారించిన కారణంగానే ఆయనకు పార్ట్ టైం పొలిటీషియన్ అన్న పేరు వచ్చేసింది. ఈ చట్రం నుంచి తప్పించుకునేందుకు పవన్ ఇప్పటిదాకా ఏమీ చేయకున్నా... మొన్నటికి మొన్న కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి తాను ఫుల్ టైం పాలిటిక్స్ లోకి దిగుతున్నానని ప్రకటించారు. వెనువెంటనే చలోరే చలోరే చల్ పేరిట యాత్రను కూడా షురూ చేసేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ లో మీడియాతో పూర్తి స్థాయిలోనే మాట్లాడేసిన పవన్... తానో పార్ట్ టైం పొలిటీషియన్ ను కాదని చెప్పేసుకున్నా... తానో కన్ఫూజన్ మాస్టర్ నని చెప్పకనే చెప్పేసుకున్నారన్న వాదన వినిపించింది. అయితే పాలిటిక్స్... ప్రత్యేకించి వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ వరుసగా చేస్తున్న కామెంట్స్ పవన్ ను మరింత కన్ఫూజన్ మాస్టర్ ను చేస్తోందే తప్పించి... ఆ ముద్ర నుంచి ఆయనను బయటపడేయలేక పోతోందనే చెప్పక తప్పదు. ఎందుకంటే... రోజులో ఓ ఐదారు సార్లు మాట్లాడుతున్న పవన్... ఏ ఒక్క చోట కూడా అంతకుముందు మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నట్లుగా కనిపించడం లేదన్న వాదన వినిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో మనం పోటీ చేయడం తథ్యమని - ఈ విషయంపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని తన అభిమానులకు స్పష్టం చేసిన పవన్... ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై ఆలోచిస్తున్నానని వారిని మరింత డైలమాలో పడేశారనే చెప్పాలి. అంతకుముందు... ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతూనే... బలమున్న స్థానాల్లో మాత్రమే తన పార్టీ అభ్యర్థులు బరిలోకి దిగుతారని ప్రకటించి క్లారిటీ లెస్ వ్యాఖ్యలు చేసిన పవన్... అసలు ఏఏ స్థానాల్లో, అసలు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్న విషయాన్ని స్పష్టం చేయకుండా మరింత కన్ఫూజన్ చేసేశారు. ఇక నిన్న అనంతపురం జిల్లా ధర్మవరంలో తన యాత్ర ముగింపు సందర్భంగా మాట్లాడిన పవన్... తన అభిమానులతో పాటు తెలుగు నేల ప్రజలను మరింతగా కన్ఫూజ్ చేశారనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం తథ్యమేనని చెప్పిన పవన్.. విభజన చట్టం మేరకు ఏపీకి ప్రత్యేక హోదా రావాల్సిన అంశాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదా విషయంపై పవన్ చాలా కాలం నుంచి పోరాటం సాగిస్తున్న విషయం తెలిసిందే. తిరుపతి - కాకినాడ - అనంతపురంలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రత్యేక హోదాపై పవన్ తనదైన స్పష్టతను ఇచ్చేశారనే చెప్పాలి.
ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని కేంద్రంలోని బీజేపీ సర్కారును డిమాండ్ చేసిన పవన్... హోదాపై మాట తప్పిన బీజేపీ వైఖరిపై నిప్పులు చెరుగుతూ... హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన వైనాన్ని నిరసిస్తూ... ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చిన పవన్ నిజంగానే ఏపీ ప్రజల్లో *హోదా* ఆశలు చిగురింపజేశారనే చెప్పక తప్పదు. ఈ స్థాయిలో పవన్ పోరు సాగిస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందని కూడా ఏపీ ప్రజలు భావించారన్న విషయంలోనూ ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి. హోదా ఇవ్వని బీజేపీ సర్కారును కడిగిపారేసిన పవన్... హోదా సాధించలేని టీడీపీ ఎంపీలను కూడా వదిలిపెట్టలేదు. అంటే మొత్తంగా ప్రత్యేక హోదాపై పవన్ క్లారిటీతోనే రంగంలోకి దిగిపోయారన్న విశ్లేషణలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఓ మూడు సభలు పెట్టేసి... ఆ తర్వాత చప్పుడు చేయకుండా ఉండిపోయిన పవన్... ఇప్పుడు మళ్లీ ప్రత్యేక హోదాపై క్లారిటీతో కూడిన వ్యాఖ్యలే చేశారన్న వాదన లేకపోలేదు. ధర్మవరంలో మాట్లాడిన సందర్భంగా హోదాను ప్రస్తావించిన పవన్... ప్రత్యేక హోదా ఏపీ హక్కు అన్న మాటను వినిపించారు.
ఈ సందర్భంగా పవన్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో రాజకీయ పార్టీలు, పెద్దలు ఉన్నా విభజనపై న్యాయ పోరాటం చేయలేకపోయారు. ప్రత్యేక హోదా విషయంలోనైనా అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సాధన కోసం అక్కడి రాజకీయ పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ప్రత్యేక హోదాపై మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. ప్రత్యేక హోదాపై బీజేపీతో మాట్లాడి రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీపై ఉంది* అని పవన్ వ్యాఖ్యానించారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలతో ప్రత్యేక హోదాపై తనకు ఫుల్ క్లారిటీ ఉందని నిరూపించుకున్న పవన్... ఆ విషయంపై డిమాండ్ చేసే స్థాయిలో వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. ప్రజా సమస్యలు పరిష్కరించే పార్టీకే తన మద్దతు అని ప్రకటించిన పవన్.. ప్రత్యేక హోదా సాధించే పార్టీకే తన మద్దతు అని ఎందుకు ప్రకటించడం లేదన్న వాదన కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా ప్రత్యేక హోదాపై పవన్‌కు క్లారిటీ ఉన్నా.. వాయిస్ మిస్ అయ్యిందన్న వాదన కూడా వినిపిస్తోంది. మొత్తంగా తనదైన వాయిస్ తో ప్రస్తావించే అంశాలపై పవన్ కు క్లారిటీ ఉండటం లేదని, అదే సమయంలో క్లారిటీ ఉన్న అంశాలపై పవన్ వాయిస్ వినిపించడం లేదన్న విశ్లేషణ సాగుతోంది. మరి దీనికి పవన్ గానీ, జనసేన గానీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.