ఇన్ని మాటలు చెప్పి.. మోడీని ఎందుకు కల్వనట్లు..?

Update: 2015-07-07 05:12 GMT
ఏపీ ఎంపీలు చేతగాని వాళ్లు. పౌరుషం లేని వారు. మాటకు ముందు.. మాటకు తర్వాత ప్రధానిమంత్రి మోడీని తాను ఎన్నికల సమయంలో కలిసిన సందర్భాన్ని పలుమార్లు ప్రస్తావించి.. ఆయన దగ్గర తనకు చనువు ఉందన్నట్లుగా మాట్లాడిన పవన్‌కల్యాణ్‌.. ఏపీ ప్రయోజనాల కోసం ఎందుకు మాట్లాడనట్లు?

ఎవరిదాకానో ఎందుకు? ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన నటుడు శివాజీకి అండగా నేను ఉన్నానంటూ ఒక్క వ్యాఖ్య కూడా పవన్‌ ఎందుకు చేయలేదు. బయటకు వచ్చి ప్రకటన చేయటానికి సమయం కుదరకపోవచ్చు.. ప్రెస్‌నోట్‌.. అది కూడా కాకపోతే ట్విట్టర్‌లో ట్వీట్‌ ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించి.. ఏపీ ప్రయోజనాల కోసం ఒంటరిగా పోరాటం చేస్తున్న నటుడు శివాజీకి నైతిక మద్ధతు ఇస్తున్నట్లు ఎందుకు ప్రకటించలేదు?

ప్రధాని మోడీ వద్దకు వెళ్లి.. ఏపీ ప్రయోజనాల గురించి మరిచిపోతున్నారని.. గతంలో ఇచ్చిన హామీల్ని మర్చిపోతున్నారంటూ తన వంతుగా తాను ఎందుకు ప్రయత్నించనట్లు? తాను చేయని ప్రయత్నాన్ని ఎంపీల్ని చేయమనటం ఒకటైతే.. వీటన్నింటికి మించి.. శివాజీ లాంటి వారు నిజాయితీగా పోరాడుతుంటే.. వారికి నైతిక స్థైర్యం ఇచ్చేలా ఎందుకు వ్యవహరించటం లేదు?

సౌరుషం.. రోషం.. ఆత్మాభిమానం లాంటి మాటల్నిమాట్లాడిన పవన్‌.. అలాంటివి తనలో కూడా ఉన్నాయని.. ఎన్నికల ముందు తనకిచ్చిన హామీలను.. తర్వాత తుంగలోకి తొక్కిన నేతల్ని ఎందుకు నిలదీయటం లేదు? మోడీ లాంటి వారితో భేటీ అయి అమితుమీ తేల్చేయొచ్చుగా..? అయితే.. తాను ఫుల్‌టైం పొలిటీషన్‌ కానన్న మాట పవన్‌ చెప్పుకోవచ్చు. మధ్య మధ్యలో స్పందించే పవన్‌.. ఏపీ ప్రజల ప్రయోజనాల కోసం పోరాడేందుకు ఫుల్‌ టైం పొలిటీషియన్‌ కావాల్సిన అవసరం ఏముంది..?

Tags:    

Similar News