అవిశ్వాసం అక్క‌ర్లేద‌న్నావు..ఇప్పుడెందుకు పెట్టావు బాబు?

Update: 2018-03-16 08:09 GMT
జనసేన అదినేత పవన్‌ కళ్యాణ్‌ గుంటూరు నగరంలో పర్యటించారు. జీజీహెచ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. మరో వైపు అతిసారాతో మృతి చెందిన వారి సంఖ్య14కు చేరింది. తాజాగా.. ఈరోజు ఉదయం రత్తయ్య అనే మరో వ్యక్తి అతిసారాతో మృతి చెందాడు. దాదాపు 200 మంది డయేరియా రోగులు జిజిహెచ్‌ లో చికిత్స పొందుతున్నారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీపై విరుచుకుప‌డ్డారు. అతిసారంపై ప్రభుత్వం 48 గంటల్లో స్పందించాలని లేనిపక్షంలో గుంటూరు బంద్ కు పిలుపు ఇస్తాన‌ని పవన్ కళ్యాణ్ ప్ర‌క‌టించారు. అవసరమైతే దీక్ష చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అభివృద్ధి జపం చేస్తున్నారు..సురక్షితమైన నీరు ఇవ్వలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్ డిమాండ్ చేశారు. `తాగునీరు కలుషితం కావడంతో 14 మంది చనిపోయారు. మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదు. చనిపోయిన ప్రాణాలు తీసుకురాలేం - దీనికి ఎవరు భాద్యులు ? దీనికి కారణం ప్రభుత్వం. ఇప్పుటి వరకు రాజకీయ పార్టీలు వారి స్వార్ధం కోసం పనిచేశాయి. అభివృద్ధి - అభివృద్ది అంటున్నారు కానీ త్రాగునీరు ఇచ్చే పరిస్దితి కూడా లేదు. అమరావతి రాజధానిని ప్రపంచపటంలో ఏమని  చూపిస్తారు?` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం గుప్పించారు. `రాజధాని కూతవేటు దూరంలో గుంటూరు ఉంది, ఘటనపై ఐఏఎస్ తో కమిటీ వేయలేదు. ఇక్కడ ప్రజాప్రతినిధులకు ఈ సమస్య పట్టడం లేదా?అసెంబ్లీలో ఈఅంశంపై తూతూ మాత్రంగా చర్చించారు. ప్రజాసమస్యలకు తుంగలో తొక్కే హక్కు ఎవరికీ లేదు. గుంటూరు కార్పొరేషన్ కు ఎన్నికలు పెట్టలేదు, క‌నీసం ఎన్నికలు పెడితే కార్పోరేటర్లకు సమస్య చెప్పుకునేవారు. ప్రజలు ఎక్స్  గ్రేషియా వైపు చూడరు - ఎక్స్  గ్రేషియా ఇచ్చామంటు గొప్పలు చెబుతున్నారు, ఇది మంచి పద్దతి కాదు. కల్తీలకు గుంటూరు అడ్డాగా మారింది, కారంలో రంపంపోడి కలుపుతారని విన్నాను. తప్పు చేసిన వారికి శిక్షపడాల్సిందే, తప్పు చేసిన వారిని నిలదీయండి. పెషెంట్ లకు బెడ్ లు కేటాయించలేదు, 14ఏళ్ళ షేక్ ఫరూక్ కు నూరేళ్లు నిండడం బాధగా  ఉంది. ఆరోగ్యాంద్రప్రదేశ్ ఎక్కడ ఉంది?` అంటూ ప‌వ‌న్ తెలుగుదేశం ప్ర‌భుత్వంపై మండిప‌డింది.

అవిశ్వాసం విషయంలో ఇంత గందరగోళం ఎందుకు?. ఇంత హడావుడిగా అవిశ్వాస తీర్మానాలు ఎందుకు పెట్టారని  పవన్ కళ్యాణ్ ప్ర‌శ్నించారు. `టీడీపీ అయితే అసలు అవిశ్వాసమే అవసరం లేదంది..మరి ఇప్పుడెందుకు అవిశ్వాసం పెడుతోంది? వైసీపీ అసెంబ్లీకి వెళ్ళాలి..ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలి. వైసీపీ సభ్యులు అసెంబ్లీకి వెళ్ళం అంటే కుదరదు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు నాకుంది.నోటికొచ్చినట్లు మాట్లాడితే నేను బలంగా మాట్లాడాల్సి ఉంటుంది.ప్రత్యేక హోదాపై ఏపార్టీకి  క్లారీటి లేదు`అని జనసేన అధినేత వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News