జనసేన సభలో ముద్రగ‌డ బేన‌ర్.. పవన్ కూల్ రియాక్షన్!

Update: 2023-06-26 10:04 GMT
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి యాత్ర ఆదివారంతో ముగిసింది. సుమారు 12 రోజులపాటు 8 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగింది. ఇందులో భాగంగా కాకినాడలో జరిగిన జనసేన సభ.. ఏపీ రాజకీయాలను ఒక కుదుపుకుదిపిందనే చెప్పాలి. ఈ సభలో పవన్ పూనకాలు లోడింగ్ ప్రసంగం అనంతరం ముద్రగడ రియాక్షన్... కాపు సామాజికవర్గంలో కొత్త అలజడిని తెచ్చిందని అంటున్నారు.

ఈ సందర్భలో యువకులను అడ్డుపెట్టుకుని కొంతమంది నాయకులు తమ రాజకీయపబ్బం గడుపుకుంటున్నారంటూ పవన్ చేసిన ప్రసంగం ముద్రగడకు తగిలిందని అంటున్నారు. అనంతరం ముద్రగడ ఒక బహిరంగ లేఖ రాశారు. పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఈ లేఖపై పవన్ స్పందించలేదు కానీ... జనసైనికులు, పవన్ ఫ్యాన్స్ కొంతమంది మాత్రం ముద్రగడను బూతులుతిట్టడం, వల్గర్ గా మెసేజ్ లు పంపడం చేశారని ముద్రగడ ఆరోపించారు.

ఇదే సమయంలో పవన్ పై ఈ విషయాలను ప్రస్థావిస్తూ... మరో లేఖాస్త్రం సంధించారు ముద్రగడ. పిఠాపురంలో పోటీకి రమ్మని తనను పవన్ ఛాలెంజ్ చేయాలని ముద్రగడ ఆ లేఖలో కోరారు.

అయితే ఈ లేఖల్లో ఒకదానిపై కాకపోతే మరొకదానిపై అయినా పవన్ స్పందిస్తారని అంతా భావించారు. జనసైనికులు కూడా స్పందించాలని బలంగా కోరుకున్నారు. కారణం తెలియదు కానీ... పవన్ సైలెంటైపోయారు.

ఈ క్రమంలో తాజాగా రాజోలు నియోజకవర్గంలోని మలికిపురంలో జరిగిన బహిరంగ సభలో ఒక జనసైనికుడు ముద్రగ‌డ ప‌ద్మనాభంకు వ్యతిరేకంగా ఉన్న బ్యానర్ పట్టుకుని కనిపించాడు. అది గమనించిన పవన్... త‌న ప్రసంగాన్ని ఆపి.. ఆ బేన‌ర్‌ ను దించేయ‌మ‌ని కోరాడు. పెద్దలు మ‌న‌ల్ని కొన్నిసార్లు కొన్ని మాట‌లు అంటారు.. అంత‌మాత్రాన వాళ్లను మ‌నం ఏమీ అన‌కూడ‌దు అంటూ పేరెత్తకుండానే తన అభిప్రాయాన్ని చెప్పారు.

దీంతో... ముద్రగడ విషయంలో పవన్ రియాక్షన్ ఏమిటనేది స్పష్టమయ్యిందని అంటున్నారు విశ్లేషకులు.

Similar News