పవన్ చెప్పాడు.. అభిమానులు వింటారా?

Update: 2018-03-14 08:46 GMT
సంప్రదాయ రాజకీయ పార్టీలకు తన ‘జనసేన’ భిన్నమైందని చెబుతుంటాడు పవన్ కళ్యాణ్. అప్పుడప్పుడూ ఈ విషయాన్ని చాటడానికి ప్రయత్నిస్తుంటాడు. జనసేన నాలుగో వార్షికోత్సవం నేపథ్యంలో ఈ రోజు భారీ ఎత్తున గుంటూరులో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వేడుకలకు వచ్చే అభిమానులకు జనసేన తరఫున ఇచ్చిన సూచనలు చర్చనీయాంశం అవుతున్నాయి. కార్యకర్తలు.. అభిమానులకు 14 సూచనలతో ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది జనసేన. ఆ సూచనలేంటో ఒకసారి చూద్దాం.

1. టోల్ ప్లాజా సిబ్బందితో వివాదం పెట్టుకోవద్దు.

2. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగించకుండా వారికి దారి ఇవ్వాలి.

3. ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించి పార్టీ హోదాని నిలబెట్టండి.

4. పోలీసులతో - ప్రభుత్వ అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉండండి.

5. ప్రజలని గౌరవించండి. వారితో దురుసుగా ప్రవర్తించకండి.

6. మద్యం సేవించి వాహనం నడపకండి.

7. రోడ్లు మరియు ఇతర ప్రదేశాల్లో అనవసరంగా వాహనాలు ఆపకండి.

8. ఇతర వాహనాలని ఓవర్ టేక్ చేయకండి. అతి వేగం వద్దు, సాధారణ వేగంతో నడపండి.

9. ద్విచక్రవాహనాల సైలెన్సర్లు తీసి రోడ్లపై నడపకండి.

10. సభాస్థలిలో శాంతంగా ఉండండి - సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి.

11. అనుక్షణం పార్టీ హోదాని నిలబెట్టండి. వ్యక్తిగత ప్రాధాన్యత కంటే పార్టీ ప్రాధాన్యత ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి.

12. చెట్లు - గోడలు - టవర్లు - స్పీకర్ల పైకి ఎక్కకండి.

13. విద్యుత్తు స్తంభాలకి దూరంగా ఉండండి.

14. జిల్లాలోని ప్రచారపత్రాల్లో పార్టీ ప్రెసిడెంట్ ఫోటో మరియు పార్టీ ఆమోదించిన వారి ఫోటోలు తప్ప వేరే ఎవరివీ ఉండకూడదు. క్షేమంగా వచ్చి - క్షేమంగా వెళ్లండి.

ఐతే రాజకీయ పార్టీలకు సంబంధించిన సభలు.. వేడుకలు అంటే అక్కడికి వచ్చేవాళ్లు మద్యం తాగడం.. హంగామా చేయడం అన్నది మామూలు విషయం.ఇందుకు ఏ పార్టీ కార్యకర్తలూ మినహాయింపు కాదు. మరి జనసేన కార్యకర్తలు పవన్ చెప్పాడని బుద్ధిగా ఉంటారా? ఆయన చెప్పిన సూనలు పాటిస్తారా..? మద్యం తాగకుండా.. ఏ గొడవా చేయకుండా ప్లీనరీని ముగించడానికి సహకరిస్తారా?
Tags:    

Similar News