తెలుగు సినీ పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కకపోవడం.. కాస్టింగ్ కౌచ్ గురించి నెల రోజుల కిందటి నుంచి చేస్తున్న ఆరోపణలు.. దాని మీద నడుస్తున్న గొడవ సంగతి తెలిసిందే. ‘మా’ కార్యాలయం ముందు శ్రీరెడ్డి చేసిన అర్ధనగ్న నిరసనతో దేశవ్యాప్తంగా ఈ ఇష్యూ చర్చనీయాంశమైంది. ఈ విషయమై సినీ ప్రముఖులెవరూ పెద్దగా స్పందించిది లేదు. ఐతే తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఈ గొడవ గురించి మీడియాతో మాట్లాడాడు. అంబేద్కర్ జయంతి సందర్భంగా మీడియాను కలిసిన ఆయన శ్రీరెడ్డి ఇష్యూకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీని గురించి పవన్ చాలా పరిణతితో మాట్లాడాడు.
ఇలాంటి ఇష్యూస్ తలెత్తినపుడు టీవీలకు వెళ్తే లాభం లేదు. కోర్టులో కేసులేయాలని... పోలీస్ స్టేషన్లకు వెళ్లాలని పవన్ సూచించాడు. సెన్సేషనలిజం కంటే చట్ట ప్రకారం వెళ్లడమే సమంజసం అన్నది తన అభిప్రాయమని పవన్ అన్నాడు. రోడ్డు మీదికొచ్చి శ్రీరెడ్డి తరహాలో నిరసన వ్యక్తం చేయడం వల్ల లాభం లేదని పవన్ అభిప్రాయపడ్డాడు. మీడియాలో ఎంత మాట్లాడినా ప్రయోజనం ఉండదని.. మీడియా వాళ్లు మెసేజ్ పట్టుకెళ్లగలరు కానీ న్యాయం చేయాల్సింది మాత్రం పోలీసులు.. కోర్టులే అని.. ఇలాంటి వాటికి చట్టసభల్లోనే పరిష్కారం చూపించాలని పవన్ అన్నాడు. మీడియావాళ్లకు కూడా ఈ విషయంలో బాధ్యత ఉండాలని.. ఊరికే చర్చలు పెట్టి నెల రోజులు మాట్లాడినా లాభం ఏమీ ఉండదని.. ఆ చర్చలు టాక్ షోల మాదిరి తయారవుతాయని.. టీఆర్పీల మీద దృష్టి పెట్టకుండా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నించాలని పవన్ అన్నాడు. ఫలానా వాళ్ల వల్ల అన్యాయం జరిగిందని బాధితులు పోలీసులు ముందుకు తీసుకెళ్తే అలాంటి సందర్భాల్లో మీడియా వాళ్లకు అండగా నిలిచే ప్రయత్నం చేయాలని చెప్పాడు. చట్ట ప్రకారం ప్రయత్నించి.. అక్కడ న్యాయం జరగకపోతే ఆ తర్వాత మీడియా ముందుకు.. రోడ్డు మీదికి రావాలని.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోమని తాను చెప్పనని.. ముందు చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేయాల్సిందే అని పవన్ అన్నాడు. తాను శ్రీరెడ్డికి ఈ ఇష్యూలో అండగా నిలుస్తానని పవన్ స్పష్టం చేశాడు.