ఆలోచించనని చెప్పే పవన్.. కాపు కులం గురించి మాట్లాడేశారే?

Update: 2021-01-30 03:10 GMT
కులాలకు.. మతాలకు.. వర్గాలకు.. ప్రాంతాలకు అతీతంగా రాజకీయాలు చేసే వ్యక్తినంటూ తన గురించి అదే పనిగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశ్వ మానవుడన్న తరహాలో మాటలు చెప్పే పవన్ కల్యాణ్.. తన చుట్టూ ఉండే కోటరీలో ఎక్కువమంది ఒక సామాజిక వర్గానికి చెందిన వారేమిటన్న ప్రశ్నకు ఎంత బుర్ర బద్ధలు కొట్టుకున్న అర్థం కాని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. కులాలు పట్టవని అదే పనిగా చెప్పినా.. ఆయన మీద కాపు సామాజిక వర్గం వారు పెట్టుకునే ఆశలు.. ఆకాంక్షలు చాలానే ఉంటాయి. కులాల ప్రస్తావన తాను తేనని చెప్పే ఆయన.. తాజాగా మాత్రం అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం ఆసక్తికరంగా మారింది. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత.. ఒకప్పుడు ప్రజారాజ్యంలో పెద్ద మనిషిగా వెలుగొందిన చేగొండి హరిరామయ్యజోగయ్యతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గంపై కీలక వ్యాఖ్యల చేయటం గమనార్హం. శాసించే స్థాయిలో ఉండాల్సిన కాపులు.. యాచించే స్థాయిలోఉన్నారంటూ వాపోయారు. రాజకీయంగా.. సామాజికంగా కాపుల్లోనూ.. బీసీ కులాల్లోనూ అసమానతలు ఉన్నాయని చెప్పిన ఆయన.. కాపుల సమస్యల పరిష్కారం కోసం జనసేన అండగా ఉంటుందన్న మాట ఇచ్చినట్లుగా చెబుతున్నారు.

ఓపక్క కులాలకు.. మతాలకు అతీతంగా రాజకీయాలు చేస్తానని చెప్పే ఆయన. . కాపు సామాజిక వర్గానికి సంబంధించి చేసిన వ్యాఖ్యలు విన్న వారంతా నోరెళ్ల బెడుతున్నారు. ఓవైపు తనకు కులాలు పట్టవని చెబుతూనే.. ఆ పేరుతో రాజకీయ వ్యాఖ్యలు చేయటం ఏమిటన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. మరి.. దీనికేమంటారు పవన్ జీ?
Tags:    

Similar News