ఇక అనుష్టప్‌ నారసింహ యాత్రకు పవన్‌ కల్యాణ్‌ శ్రీకారం!

Update: 2023-01-24 15:28 GMT
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇక ఎన్నికల సమరానికి సిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తన ఎన్నికల ప్రచార రథం 'వారాహి'కి వేదపండితులతో శాస్త్రోక్తంగా పూజలు చేయించారు. తర్వాత వారాహి వాహనాన్ని ఆయన ప్రారంభించారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు, జనసేన కార్యకర్తలు కొండగట్టుకు భారీగా తరలిరావడంతో ఆ ఊరు పోటెత్తింది. గజమాలతో అభిమానులు పవన్‌ ను సత్కరించారు. ఈ సందర్భంగా అభిమానులకు ఓపెన్‌టాప్‌ వాహనం నుంచి పవన్‌ అభివాదం చేస్తూ ముందుకు సాగారు.

కొండగట్టులో పవన్‌ యాత్ర పూర్తి కావడంతో షెడ్యూల్‌ ప్రకారం.. జనవరి 24 సాయంత్రం నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ జనసేన పార్టీ ముఖ్య నాయకులతో పవన్‌ కల్యాణ్‌ సమావేశమవనున్నారు. అక్కడి నుంచి ఆయన గోదావరి ఒడ్డున ఉన్న ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు.

ధర్మపురి నుంచే పవన్‌ కల్యాణ్‌ అనుష్టుప్‌ నారసింహ యాత్రకు పవన్‌ శ్రీకారం చుడతారు. దీనిలో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను ఆయన దశల వారీగా సందర్శించుకుంటారు. ధర్మపురిలో లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాక ఆయన హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పర్యటన నేపథ్యంలో కొండగట్టుకు అభిమానులు పోటెత్తారు. పవన్‌ అభిమానులు, జనసేన శ్రేణులు తమ అభిమాన నేత కోసం  తెల్లవారుజామునుంచే కొండగట్టులో మకాం వేశారు.

మరోవైపు జనసేనాని పర్యటన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండటం కోసం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. కొండగట్టులోనే కాకుండా ధర్మపురిలో నారసింహ యాత్రను ప్రారంభించనున్న నేపధ్యంలో అక్కడ కూడా భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్‌ సింగ్‌', క్రిష్‌ దర్శకత్వంలో 'హరిహర వీరమల్లు' తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే సుజిత్‌ దర్శకత్వంలోనూ ఒక సినిమాలో నటించనున్నారు.

ఇంకోవైపు జనవరి నెలాఖరు నుంచి పవన్‌ తన వారాహి వాహనంలో ఆంధ్రప్రదేశ్‌ లో సుడిగాడి పర్యటన చేపడతారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లో చీలనివ్వబోనని పవన్‌ చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేసేలా పవన్‌ వారాహి యాత్రను చేపడతారని జనసేన పార్టీ వర్గాలు చెబుతున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News