గుర్తింపు వచ్చినా గ్రేటర్‌ వరకూ పవన్‌ మౌనముద్రే!

Update: 2015-10-29 04:08 GMT
పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేనకు రాజకీయ పార్టీగా గుర్తింపు లభించింది. తెలంగాణ ఎనినకల సంఘం అధికారికంగా దీనికి సంబంధించి ప్రకటన కూడా చేసింది. పార్టీకి శాశ్వతమైన గుర్తు మాత్రం ఇంకా రాలేదు. పవన్‌ కల్యాణ్‌ ఇక కేవలం ఎన్నికల ప్రచారాలకు మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం లేదు. తమ పార్టీ తరఫున.. తన అనుచరులను, పార్టీ శ్రేణులను ఎన్నికల బరిలో మోహరించేందుకు కూడా అవకాశం లభించినట్లే.

గుర్తింపు లభించినప్పటికీ.. పవన్‌ కల్యాణ్‌ మరో రెండు నెలల వరకూ పార్టీ నిర్మాణం జోలికి వెళ్లకపోవచ్చునని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం గబ్బర్‌ సింగ్‌ 2 షూటింగ్‌ పనుల్లో చాలా బిజీగా గడుపుతున్నారు. కేవలం షూటింగ్‌ కారణాల వల్లనే అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి సాక్షాత్తూ మంత్రులు వచ్చి ఆహ్వానించినా కూడా, రాలేకపోతున్నానని ఆయన సెలవిచ్చారు. అలాంటిది.. రాజకీయ పార్టీ నిర్మాణంపై దృష్టిపెట్టడానికి సమయం కేటాయించడం అంటే ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు.

అందుకే ప్రస్తుతం గుర్తింపు వచ్చినప్పటికీ వెంటనే పార్టీకి సంబధించిన పనిలోకి దిగకుండా.. ఈ రెండు నెలలు విరామం తీసుకోవాలనే పవన్‌ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పార్టీకి సంబంధించిన ఏ పని అయినా కొత్త సంవత్సరంలోనే మొదలు కావొచ్చు. ఎటూ ఆ సమయానికి గబ్బర్‌ సింగ్‌2 హడావిడి కూడా ముగిసిపోతుంది. సంక్రాంతి తర్వాత.. సెంటిమెంటు పరంగా కూడా మంచిరోజులు మొదలవుతాయి. అప్పటినుంచి పవన్‌ పార్టీ నిర్మాణం మీద దృష్టి పెడతారని అంటున్నారు.

అయితే ఇదంతా పరోక్షంగా ఫిబ్రవరిలో జరుగుతాయని అనుకుంటున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు జనసేనను సమాయత్తం చేసే ప్రయత్నంగా కనిపిస్తున్నది. పవన్‌ తాను పార్టీని ప్రకటించిన నాటినుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల మీద కన్ను ఉన్నట్లుగా కొన్ని సందర్భాల్లో బయటపడ్డారు. ఎన్డీయే కూటమిలో కీలక వ్యక్తిగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనే ప్రచారంలో బీభత్సంగా పాల్గొన్న పవన్‌ కల్యాణ్‌.. గ్రేటర్‌ ఎన్నికల్లో తన పార్టీకి సముచిత వాటా కావాలని అడగవచ్చు. ఇప్పటికే నగర ఎన్నికల్లో సీట్లు పంచుకోవడానికి తెలుగుదేశం - భాజపా లెక్కలు వేసుకుంటున్నాయి. ఈ సారి గ్రేటర్‌ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీయే కూటమినుంచి మూడో పార్టీగా జనసేన కూడా బరిలో ఉంటుందని అంతా అనుకుంటున్నారు.
Tags:    

Similar News