కొండగట్టుకు పవన్ కల్యాణ్.. తెలంగాణలో జనసేన జోష్..

Update: 2023-01-24 11:54 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు పర్యటన ఆసక్తి కలిగిస్తోంది. తెలంగాణలోనూ తమ పార్టీ ఉనికి అంది అని చాటుకునేందుకే ఆయన కొండగట్టును ఎంచుకున్నారా..? అనే చర్చ సాగుతోంది. జనసేన ప్రచార రథం 'వారాహి' కోసం కొండగట్టులో పూజలు నిర్వహించిన తరువాత తెలంగాణ లోని జనసైనికులతో సమావేశం కానున్నారు. మల్యాల మండలంలోని నాచుపల్లిలో ఓ రిసార్ట్ లో నిర్వహించే ఈ సమావేశంలో భవిష్యత్ లో చేయబోయే కార్యకలాపాల గురించి వివరించనున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందనే సంకేతాలు పంపనున్నారు. 2018లో పోటీ చేయని జనసేన వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. దీంతో ఇక్కడి జనసేన కార్యకర్తల్లో జోష్ పెరిగింది.

ఏపీలో 2019లో నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటును గెల్చుకుంది. అయితే అంతటితో ఆగకుండా జనసేన జనం వెంటే ఉంటుందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ముందుగా రైతుల పక్షాన నిలబడిన ఆయన ఆ తరువాత రోడ్లు, ఇతర సమస్యల కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కంటే జనసేన వైపు ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.  జనసేన సైతం తమ  కార్యాకలాపాలను ఏపీ వ్యాప్తంగా విస్తరిస్తూ ప్రజల్లోకి చొచ్చుకుపోతోంది.

ఇప్పుడు తెలంగాణలోనూ జనసేనను విస్తరించాలని చూస్తోంది. ఇందులో భాగంగా జనసేన ప్రచార రథం 'వారాహి'కి తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టులో పూజ చేస్తున్నారు. గతంలో కొండగట్టు వద్ద జరిగిన ఓ ప్రమాదంలో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

తనను కొండగట్టు అంజన్న కాపాడాడని, అందుకే సెంటిమెంట్ గా కొండగట్టులో 'వారాహి'కి పూజలు చేస్తున్నారని జనసైనికులు చెబుతున్నారు. కానీ 'వారాహి'కి పూజలు నిర్వహించిన తరువాత తెలంగాణలోని అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పనున్నారు.

ఏపీ కంటే తెలంగాణలో ముందే అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా ఆయన తెలంగాణలో రాజకీయ వేడిని రగిల్చినట్లు చెబుతున్నారు. అంతేకాకుండా ఆయన 32 దేవాలయాలు సందర్శిస్తారని, అందులో మొదట తెలంగాణలోని ధర్మపురి లక్ష్మీనరసింహాస్వామి ఆలయంలో మొదలు పెడుతారని అంటున్నారు.

ఈ కారణంగా ఆయన తెలంగాణ ప్రజల్లో జనసేన ఉనికిని చాటనున్నారు. దీంతో అటు ఏపీలో, ఇటు తెలంగాణలో జనసేన వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News