ప‌వ‌న్ సంచ‌ల‌నం:న‌న్నేం చేస్తారు..ఏం పీకుతారు?

Update: 2017-12-06 08:29 GMT
జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొద్ది నెల‌లుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటూ.. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చేస్తున్నా.. అంటూ ఊరిస్తున్న ఆయ‌న డిసెంబ‌రు మొద‌టి వారం వ‌ర‌కూ మౌనంగానే ఉన్నారు. ఉన్న‌ట్లుండి త‌న షెడ్యూల్‌ ను ప్ర‌క‌టించిన ఆయ‌న‌.. తొలి ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఏపీ విశాఖ‌లో ప‌ర్య‌టన‌కు వెళుతున్న‌ట్లు వెల్ల‌డించారు. లాభాల బాట‌లో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను అమ్మే ప్ర‌య‌త్నాన్ని ఆయ‌న త‌ప్పు ప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. "లాభాల బాట‌లో ఉన్న డ్రెడ్డింగ్ కార్పొరేష‌న్ ను ఎందుకు ప్రైవేటీక‌ర‌ణం చేస్తున్నారు.  1960 చివ‌ర్లో డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ను మొద‌లు పెట్టిన‌ప్పుడు షేర్ మార్కెట్లో రూ.10 ప్రారంభించి.. ఇప్పుడు రూ.700 వ‌ర‌కు తీసుకెళ్లారంటే ఆ సంస్థ ఎంత బాగా ప‌ని చేస్తుందో అర్థ‌మ‌వుతుంది. ఒక ప్ర‌భుత్వం రంగ సంస్థ లాభాల్లో లేన‌ప్పుడు అమ్ముతున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు. కానీ.. లాభాల్లో ఉన్న డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ను అమ్మ‌టాన్ని ఒప్పుకోం. బ‌కాయిలుక‌ట్ట‌టం లేదంటారు.. గ‌వ‌ర్న‌మెంటుకు సంబంధించిన  వేరే సంస్థ‌లు అప్పులు ఉన్నాయి. ఆ బ‌కాయిల్ని సాకుగా చూపించి.. లాభాల్లో ఉన్న సంస్థ‌ను అమ్మేయ‌టం కావాల‌ని దాన్ని చంపేయ‌ట‌మే. ఇలాంటి వాటిని వ్య‌తిరేకిస్తా" అని చెప్పారు.

తాను తెలుగుదేశం.. బీజేపీ ప‌క్షాన ఉండ‌న‌ని.. తాను ప్ర‌జ‌ల ప‌క్షాన ఉంటాన‌న్నారు. ఎవ‌రిని ఏ రోజు కూడా త‌న‌కు అనుకూలంగా ఫ‌లానా ప‌ని చేయాల‌ని ఆడ‌గ‌లేద‌న్నారు. స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాకు సెన్సార్ స‌మ‌స్య‌లు వ‌స్తే తాను ఎవ‌రినీ అడ‌గ‌లేద‌ని.. స‌మ‌స్య‌ల్ని భ‌రిస్తానే కానీ పారిపోన‌న్నారు.

రాష్ట్ర.. కేంద్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా మాట్లాడితే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని.. కేసుల ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని హెచ్చ‌రిస్తున్నార‌ని..అయితే త‌న‌ను ఎవ‌రేం పీకుతారంటూ  సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏం పీకుతార‌న్న మాట‌ను ముప్పాతిక వ‌ర‌కూ చెప్పి.. అక్క‌డితో ఆగి.. ఏం చేస్తార‌ని అడుగుతున్నా అంటూ ప‌వ‌న్ మాట్లాడ‌టం గ‌మ‌నార్హం.

ఉన్న‌ది ఒక్క‌టే ప్రాణ‌మ‌ని పోగొట్టుకోవ‌టానికి తాను సిద్ధ‌మ‌ని.. ప్ర‌జ‌ల కోసం ప్రాణాలు పోగొట్టుకునేందుకు సిద్ధ‌మ‌న్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం దెబ్బ‌లు తిన‌టానికైనా.. ర‌క్తం కారేలా కొట్టించుకోవ‌టానికైనా.. జైలుకు వెళ్లేందుకైనా తాను సిద్ద‌మ‌న్నారు.

త‌న‌కు ఒక‌టే కుటుంబ‌మ‌ని.. అది ప్ర‌జ‌ల కుటుంబ‌మ‌న్న ప‌వ‌న్‌.. త‌న‌కు స్నేహితులు ప్ర‌జ‌లేన‌ని.. త‌న‌కు భ‌యాలు లేవ‌ని.. ఉన్న‌దంతా ధైర్య‌మేన‌న్నారు. తానుక‌డుపు మండి మాట్లాడుతున్నాన‌ని.. ప్ర‌భుత్వాలు చేసే త‌ప్ప‌ల్ని ప్ర‌శ్నిస్తూనే ఉంటాన‌ని..  ఏం చేస్తార‌ని గ‌ర్జించారు.

త‌న‌కు గొడ‌వ‌లు పెట్టుకోవ‌టం ఇష్టం ఉండ‌ద‌ని.. సమ‌స్య‌ల్ని ప‌రిష్క‌రించే అంశం మీద‌నే తాను దృష్టి పెడ‌తాన‌న్నారు.  విభ‌జ‌న స‌మ‌స్య‌లు ఇంకా వెంటాడుతూనేఉన్నాయ‌ని.. హైద‌రాబాద్ లోని ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌టం లేద‌న్నారు. కొన్ని విభ‌జ‌న స‌మ‌స్య‌లు  ఉన్నాయ‌ని చెబుతున్నారు కానీ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌టం లేద‌న్నారు.

త‌న‌కు ఇబ్బందులు ఎదురైతే ఎవ‌రిని అడ‌గ‌న‌ని. సొంత ప‌నుల కోసం ఎప్పుడూ ఎవ‌రి ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌లేద‌ని.. ఎవ‌రిని సంప్ర‌దించ‌లేద‌న్నారు. త‌న‌కు అధికార దాహం లేద‌ని.. ఎన్నిక‌ల్లో పోటీ చేసి ముఖ్య‌మంత్రిని అయిపోవాల‌న్న ఆలోచ‌న లేద‌న్నారు. సీఎం ప‌ద‌వికి అనుభ‌వం అవ‌స‌ర‌మ‌ని.. అధికారం బాధ్య‌త‌గా తాను భావిస్తాన‌న్నారు. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సీఎం కావ‌ట‌మే ముఖ్య‌మ‌న్న ఆలోచ‌న ధోర‌ణి స‌రికాద‌న్నారు.  త‌న‌కు అధికార‌మే కావాల‌నుకుంటే 2009లో తాను అన‌కాప‌ల్లి నుంచో.. విశాఖ నుంచో పోటీ చేస్తానంటూ ఆ రోజున ఎవ‌రు మాత్రం త‌న‌ను ఆప‌గ‌లిగేవార‌ని ప్ర‌శ్నించిన ప‌వ‌న్‌..  పోటీ చేసి గెల‌వ‌లేనా? అని వ్యాఖ్యానించారు. దెబ్బ‌లు తిన్న‌వాడు తిర‌గ‌బ‌డితే ఎలా ఉంటుందో తాను చూపిస్తానంటూ ప‌వ‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ప‌వ‌న్ మాట్లాడుతున్న వేళ‌.. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్న వారి వ్యాఖ్య‌ల‌కు అడ్డు త‌గులుతూ అంద‌రూ చేసే త‌ప్పులు మీరు చేయొద్దంటూ.. నినాదాలు ఆపాల్సిందిగా కోరారు.  డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ప్రైవేటీక‌ర‌ణ నిలుపుద‌ల విష‌యంలో హ‌రిబాబు.. అవంతి శ్రీ‌నివాస్ లు త‌ప్పించుకోవ‌చ్చేమో కానీ జ‌న‌సేన మాత్రం త‌ప్పించుకోద‌న్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ను కాపాడుకోవ‌టం అన్ని పార్టీల బాధ్య‌త‌న్నారు. తాను ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌ధాని మోడీని ఏమీ అడ‌గ‌లేద‌ని.. తొలిసారి తాను ఆయ‌న‌కు లేఖ రాస్తున్నాన‌ని.. డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ ప్రైవేటీక‌ర‌ణ‌ను నిలిపివేయాల‌ని కోర‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇందుకు సంబంధించిన లేఖ‌ను చూపించారు.

డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ అమ్మాటాన్ని అడ్డుకోకుంటే.. రేపొద్దున స్టీల్ ప్లాంట్‌ ను కూడా అమ్మే ప్ర‌య‌త్నం చేస్తార‌న్న ప‌వ‌న్‌.. ప‌ద‌వుల కోసం తాను రాజకీయాల్లోకి రాలేద‌న్నారు. త‌న మ‌న‌సులో ప్ర‌జ‌లు ఉంటారే త‌ప్పించి.. పార్టీలు ఉండ‌వ‌ని.. ఏ పార్టీ అయితే ప్ర‌జ‌ల గురించి ఆలోచిస్తుందో ఆ పార్టీ వెంట న‌డిచేందుకు తాను వెనుకాడ‌న‌న్నారు. మోడీతో త‌న‌కు విభేదాలు లేవ‌ని.. కాకుంటే ఆయ‌న తీసుకునే విధానాల విష‌యంలో త‌న‌కు కొన్ని అభ్యంత‌రాలు ఉన్నాయ‌న్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేష‌న్ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం తాను అండ‌గా నిలుస్తాన‌ని.. ప్రైవేటీక‌ర‌ణ‌ను అడ్డుకుంటాన‌ని చెప్పారు. లాభాల్లో ఉన్న‌ కంపెనీని ప్రైవేటు వ్య‌క్తుల‌కు ధారాద‌త్తం చేయ‌టం స‌రికాద‌న్నారు.
Tags:    

Similar News