రాజ‌కీయం వంట‌బ‌ట్టించుకుంటున్న ప‌వ‌న్ !

Update: 2019-04-03 08:56 GMT
ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి ఏమీ తెలియ‌దు, యాక్ట‌ర్ అని, పిచ్చోడు అని త‌రచూ విమ‌ర్శ‌లు వింటున్నాం. కానీ ఎందుకో ఈ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట‌లు, చేత‌లు చేస్తుంటే... రాజ‌కీయం బానే ఒంట‌బ‌ట్టిన‌ట్టుంది అనిపిస్తుంది. అప్ప‌ట్లో ఎన్టీఆర్ మొద‌టి సారి పార్టీ పెట్టిన‌పుడు సామాన్యుడిలా రోడ్ల ప‌క్క‌న స్నానం చేయ‌డం, స్థానిక హోట‌ళ్ల‌లో తెప్పించుకుని తిన‌డం, బంకుల్లో టీ తాగ‌డం చేశారు. అది జ‌నాల‌కు బాగా న‌చ్చింది. ఐడియా ఓల్డే అయినా ప‌వ‌న్ మ‌ళ్లీ దానిని పాటిస్తున్నారు. నిరంత‌రం తాను సామాన్యుడిలో ఒక‌డిని అని ప్ర‌క‌టించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఆవుల షెడ్లో నుల‌క మంచం మీద ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌డం, ప్ర‌చారం మ‌ధ్య‌లో చెట్ల కింద తిన‌డం... వాటిని జ‌న‌సేన పార్టీ మీడియాకు పంపడం చేశారు. నేను మీలాంటి వాడినే అని పేద‌ల‌కు సందేశం పంప‌డం జ‌న‌సేన ఉద్దేశం కావ‌చ్చు. మ‌రోవైపు వ్యూహాత్మ‌కంగా త‌న‌కు ఎక్కువ ప‌ట్టున్న జిల్లాల‌లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పెట్ట‌డం కూడా మంచి వ్యూహ‌మే. గెలుపు ఓట‌ములు త‌రువాత‌.. ప్ర‌య‌త్నాలు అయితే గ‌ట్టిగానే ఉన్నాయి. చాలా త‌క్కువ కులాలు అనుకునే కులాలను హైలెట్ చేస్తూ వారి గురించి త‌ర‌చూ చెప్ప‌డం ద్వారా అభిమాన వ‌ర్గంతో పాటు కొత్త వ‌ర్గాల‌కు ద‌గ్గ‌ర‌య్యే ప్ర‌య‌త్నం చేస్తున్నారు ప‌వ‌న్‌.

అక్క‌డితో ఆగిపోలేదు... తాను ఇప్ప‌టివ‌ర‌కు చాలామంది పెద్ద‌వాళ్లతో ప‌నిచేశారు. విజ్ఞుల‌ను క‌లిశారు. కానీ ఎవ‌రి వ‌ద్దా చేయ‌ని ఓ ప‌ని నిన్న మాయావ‌తి వ‌ద్ద చేశారు. నిన్న అందరూ ఆశ్చర్యపోయే రీతిలో స్పందిస్తూ... మాయావతి రాగానే కారు డోరు తీసి ఆమె కాళ్లకు నమస్కారం చేశారు. గతంలో ఎన్న‌డూ రాజ‌కీయాల్లో ఎవ‌రికీ ఇలా ప‌వ‌న్ న‌మ‌స్క‌రించ‌లేదు. త‌న‌కంటే పెద్ద వార‌యిన‌ మోడీ, చంద్రబాబు, గ‌వ‌ర్న‌ర్ ఇలా ఎవ‌రికీ ఇంత గౌర‌వం ఇవ్వ‌లేదు. తాను ఇష్ట‌ప‌డే క‌మ్యూనిస్టుల‌ను కూడా ఇంత గౌర‌వించ‌లేదు. అలాంటిది సడన్‌గా పవన్‌లో ఇంతమార్పు ఎందుకు?

ద‌ళితుల్లో ప‌వ‌న్ అభిమానులు గ‌ట్టిగానే ఉన్నారు. దీంతో పాటు ద‌ళితుల్లో కూడా చాలామంది మేధావులు, త‌మ‌కు ఆత్మ‌గౌర‌వం కోరుతూ సోష‌ల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఈ ద‌ళిత మేధోవ‌ర్గానికి, సాధార‌ణ ద‌ళితుల‌కు జ‌న‌సేన‌తో క‌లిసి ర‌మ్మ‌ని ఆత్మీయ పిలుపు ఇవ్వ‌డానికే ప‌వ‌న్ ఈ ఈ ప‌నిచేశారు అంటున్నారు.

అతి సాధారణ దళిత కుటంబం నుంచి వచ్చిన మాయావతి దేశంలో అతిపెద్ద రాష్ట్రం అయిన ఉత్తరప్రదేశ్‌ కు ముఖ్యమంత్రి అయ్యారు. జాతీయ రాజ‌కీయాల‌ను కొన్ని సార్లు శాసించారు. కాంగ్రెస్‌ ను ఎదిరించి నిల‌బ‌డ్డారు.  దేశంలో ఉన్న దళిత నాయకుల్లో ఆమె ఐకాన్‌. అందుకే ఆమెకు ప‌వ‌న్ ఇచ్చే గౌర‌వం ప‌వ‌న్‌కు కొత్త వ‌ర్గాన్ని ద‌గ్గ‌ర చేసేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని విశ్లేషిస్తున్నారు. జ‌గ‌న్‌ కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారులు అయిన ద‌ళితుల‌ను ఆక‌ట్టుకోవ‌డం కూడా ప‌వ‌న్ ఉద్దేశంగా అర్థ‌మ‌వుతోంది. ఒక్క‌సారి వాళ్లు ప‌వ‌న్‌ను అభిమానించ‌డం మొద‌లుపెడితే అది ప‌వ‌న్‌కు ప‌ర్మ‌నెంట్ ఓటుబ్యాంకే. అందుకే ప‌వ‌న్ అంత‌గా త‌గ్గాడు. ఇంకో కోణంలో చెప్పాలంటే.... ప‌వ‌న్ ఎపుడు ఎలా ప్ర‌వ‌ర్తిస్తారో ఎవ‌రికీ అంతుబ‌ట్ట‌దు.
    
    
    

Tags:    

Similar News