తగ్గేదే లేదు.. వాలంటీర్ల వ్యవస్థపై పవన్ మార్క్ ప్రశ్నలు

Update: 2023-07-11 09:59 GMT
వారాహి విజయయాత్ర పేరుతో పొలిటికల్ సిరీస్ స్టార్ట్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన చాఫ్టర్ 2లో భాగంగా ప్రస్తుతం మరోసారి టూర్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. తన టూర్ లో భాగంగా వాలంటీర్ల వ్యవస్థతో పాటు.. వైసీపీకి చెందిన కొందరు నేతల పుణ్యమా అని ఏపీలో వేలాది మంది యువతులు మిస్సింగ్ అయిపోతున్నట్లుగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను చెబుతున్న మాటలకు.. తనకు కేంద్ర హోంశాఖకు చెందిన అధికారి ఒకరు సమాచారం ఇచ్చినట్లుగా చెప్పి సంచలనంగా మారారు.

పవన్ చేసిన వ్యాఖ్యలపై వాలంటీర్లు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేయటంతో పాటు.. ఏపీ వ్యాప్తంగా పవన్ దిష్టిబొమ్మల్ని తగలపెడుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఏపీ మహిళా కమిషన్ జనసేనానికి నోటీసులు జారీ చేసి.. ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాల్ని తమకు అందించాలని పేర్కొన్నారు. ఒకవేళ.. అలా చేయకుంటే తన వ్యాఖ్యలపై పవన్ క్షమాపణలు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీ మహిళా కమిషన్ నోటీసులపై పవన్ ఎలాంటి వ్యాఖ్య చేయలేదు.

ఇదిలా ఉంటే.. తనపై మండిపడుతున్న వాలంటీర్లపై పలు వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. తాను చేసిన ఆరోపణలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న వాలంటీర్ల వ్యాఖ్యలకు సమాధానాలు ఇవ్వని పవన్.. అందుకు భిన్నంగా వారి శ్రమను దోచుకుంటున్నట్లుగా ట్వీట్ చేయటం గమనార్హం. ఏపీ వ్యాప్తంగా 30 వేల మంది యువతులు.. మహిళలు మిస్ అయ్యారని. వారిలో 18 వేల మంది ఆచూకీ లభించటం లేదని చెప్పటం తెలిసిందే.

రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఒంటరి మహిళలు, బాలికలు.. మహిళలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి..ఆ వివరాల్ని నేతలకు అందించటం ద్వారా.. వారికి ఆశలు కల్పించి బయటకు తరలిస్తున్నారని.. దారుణాలకు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్.

సోమవారం జనవాణి కార్యక్రమంలో పొల్గొన్న ఆయన.. ఏలూరు కార్యకర్తలు.. వీర మహిళలతో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ''మీకు 5 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారంటున్నారు. వారి డేటా ఎస్పీ ఆఫీసు.. కలెక్టర్ ఆఫీసుల్లో ఉండాలి. వాలంటీర్ల పేరుతో యువత జీవితాల్ని వైసీపీ ప్రభుత్వం నాశనం చేస్తోంది. కేవలం రూ.5వేలరూపాయిల వేతనాన్ని ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఎవరు?'' అంటూ ప్రశ్నలు సంధించారు.

ఓవైపు వాలంటీర్లపై షాకింగ్ ఆరోపణలు చేసిన పవన్ కల్యాణ్.. మరోవైపు వాలంటీర్ల జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయన్న విషయాన్ని చెప్పుకొచ్చారు. వాలంటీర్ అని మభ్య పెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా వారి జీవితాల్ని జగన్ ప్రభుత్వం నాశనం చేస్తున్నట్లుగా పేర్కొంటూ కొన్ని ప్రశ్నల్ని సంధించారు. అవేమిటన్నది చూస్తే..

- 5 వేల రూపాయల వేతనం ఇచ్చి వెట్టి చాకిరీ చేయించుకుంటుంది ఎవరు?
-  4 ఏళ్లుగా ఉద్యోగాలు కల్పించకుండా 5 వేల జీతానికి ఊడిగం చేయిస్తూ బ్రతుకులు నాశనం చేసింది ఎవరు?
-  వాలంటీర్ అని మభ్యపెట్టి ప్రభుత్వ ఉద్యోగాల ఊసు ఎత్తకుండా మీ వయస్సు అర్హత లో 4 యేళ్లు నాశనం చేసి అర్హత లేకుండా చేసింది ఎవరు?
-   ప్రభుత్వ పథకాల చేరవేత అని చెప్పి, మీ చేత ప్రజల డేటా సేకరిస్తుంది ఎవరు?
-  మీ చేత డేటా సేకరించి, దానిని అసాంఘిక కార్యకలాపాలకు వాడుతున్నది ఎవరు?
-  మీ జీవితాల్లో ఎదిగే అవకాశాలు లేకుండా చేసి రూ.5 వేల దగ్గరే ఉంచిందెవరు?  
-  వాలంటీర్ వ్యవస్థతో వాలంటీర్ల జీవితాలు మారలేదు. వారిని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు బాగుపడుతున్నారన్నది వాస్తవం కాదా?
-  వైసీపీ సభలు, సమావేశాలకు ప్రజల్ని తీసుకొచ్చే భాధ్యత మీపై వేశారా లేదా?
-   మీ ప్రాంతంలో ప్రజలను మీ చేత భయపెట్టిస్తున్నరా? లేదా?

Similar News