పవన్ ను వాడేసి వదిలేశారా? వ్యూహాత్మకంగా వ్యవహరించారా?

Update: 2020-12-05 07:30 GMT
రాజకీయాల్లో ప్రతి అంశం కీలకమే. చిన్నతప్పునకు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందునా కేసీఆర్ లాంటి మాస్టర్ మైండ్ ప్రత్యర్థిగా ఉన్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ఇప్పటివరకు కేసీఆర్ తో తలపడిన వారంతా.. ఆయన్ను బలహీనుడిగా భావించారు. అదే ఆయనకు అడ్వాంటేజ్ అయ్యింది. శత్రువు బలహీనమైన వాడు అన్నప్పుడు తెలీని నిర్లక్ష్యం.. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంటుంది. అదే వారికి శాపంగా మారితే.. ప్రత్యర్థికి వరమవుతుంది.

తాజాగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో కేసీఆర్ తో తలపడిన బీజేపీ.. ఇలాంటి విషయాలపైన భారీ అధ్యయనం చేసినట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం తొందరపాటుకు గురి కాకుండా ఆద్యంతం ఆచితూచి అన్నట్లు వ్యవహరించింది. ఒక విధంగా చెప్పాలంటే.. కేసీఆర్ తో ఎన్నికల యుద్ధం అంటే అంత సింఫుల్ కాదన్న విషయాన్ని అనుక్షణం గుర్తు చేసుకుంటూ అడుగులు వేసింది. ఈ సందర్భంగా కొన్ని విమర్శలు వినిపించినా.. అంతిమంగా తాను అనుకున్నది సాధించగలిగిందని చెప్పాలి.

గ్రేటర్ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీ తరఫునపరిమిత ప్రచారానికి అవకాశం ఉందని.. జనసేన బీజేపీకి మద్దతు ఇస్తుందని చెప్పటంతో పాటు..కొన్ని స్థానాల్లో పోటీకి సిద్దమైంది. అయితే.. ఇది అటు తిరిగి ఇటు తిరిగి చివరకు ఎన్నికల ఎజెండాను పక్కదారి పట్టించేలా కేసీఆర్ పావులు కదుపుతారన్న విషయాన్నికమలనాథులు గ్రహించారు. ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. బీజేపీ -జనసేన పొత్తు ఉండదని తేల్చటంతో పాటు.. ఎన్నికల ప్రచారానికి పవన్ ను వాడుకోకూడదని నిర్ణయించారు.

ఒకవేళ..పవన్ ను వాడుకుంటే.. ఆంధ్రా కార్డును కేసీఆర్ బయటకు తీసేవారు. అదే జరిగితే.. ఎన్నికల ఎజెండా మారేది. అందుకు భిన్నంగా పవన్ ను గ్రేటర్ ఎన్నికల్లోకి రాకుండా అడ్డుకున్నారు. స్నేహపూర్వకంగా ఆయన్ను వారించినట్లు సమాచారం. పవన్ బరిలోకి దిగితే చోటు చేసుకునే పరిణామాలతో కలిగే నష్టాన్ని వివరించటంతో పవన్ సైతం శాంతించినట్లు చెబుతున్నారు. గెలుపు తప్పించి మరింకేమీ ముఖ్యం కాదన్న విషయాన్ని గుర్తించాలన్న విషయాన్ని కమలనాథులు పవన్ కు అర్థమయ్యేలా చెప్పటంతో పాటు.. ఆయన కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవటంతో ఇష్యూ అక్కడితో ఆగింది.

అయితే.. పవన్ ను బీజేపీ అవసరానికి వాడుకొని వదిలేస్తుందన్న విమర్శ ఇప్పుడు వినిపిస్తోంది. వాస్తవ కోణంలో చూస్తే.. మిత్రపక్షాలకు ఏమాత్రం నమ్మదగినట్లుగా బీజేపీ వ్యవహరించదు. దశాబ్దాల పాటు కలిసి నడిచిన శివసేనతోనే పొసగనప్పుడు.. పవన్ లాంటి వారి సంగతి చెప్పాల్సిన అవసరం ఉండదు. అలా అని.. అన్ని బంధాలు ఒకేలా ఉంటాయి.. ఒకేలాంటి ఫలితాన్ని ఇస్తాయనుకోవటం కూడా తప్పే అవుతుంది. గ్రేటర్ ఎపిసోడ్ ను చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే.. పవన్ ను సీన్లోకి తీసుకొచ్చి కేసీఆర్ కు అవకాశం ఇచ్చే కన్నా..వ్యూహాత్మకంగా ఆయన్ను ఎన్నికలు దూరంగా ఉంచాలన్న ప్లాన్ వర్క్ వుట్ అయ్యిందని చెప్పాలి. ఈ ఎత్తుగడ బీజేపీకి లాభాన్ని చేకూరిస్తే.. జనసేన అధినేతకు కలిగిన మేలు ఏమిటన్నది కాలం మాత్రమే సరైన సమాధానం చెప్పగలదు.
Tags:    

Similar News