తనను బెదిరిస్తున్న వారి గురించి తొలిసారి చెప్పిన పవన్

Update: 2020-12-04 04:00 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇప్పుడో పెద్ద కష్టం వచ్చి పడింది. అది కూడా ఆయన్ను అభిమానించే వారితోనే కావటం విశేషం. సాధారణంగా తాము అభిమానించే వారితో లాభమే తప్పించి.. నష్టం కలుగదు. అందుకు భిన్నంగా పవన్ కు మాత్రం ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లుగా చెబుతున్నారు. పవన్ కున్నఅభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనంటే వెర్రెక్కిపోయే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.

అభిమానులైతే ఉన్నారు కానీ.. వారి కారణంగా ఎన్నికల్లో ఓట్లుగా మాత్రం పడని పరిస్థితి. రాజకీయాల్లో మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. ఓట్లకు ఉండే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఈ విషయంలో జనసేన ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. ఈ బలహీనతను పవన్ అభిమానులు బాగా గుర్తించినట్లు కనిపిస్తోంది. తాజాగా జనసేన అధినేత చేసిన వ్యాఖ్య ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

పవన్ తో సెల్ఫీలు దిగేందుకు ఆయన అభిమానులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. సీరియస్ ఇష్యూల మీద పోరాడే వేళ.. ఈ సరదా సెల్ఫీల కార్యక్రమం తెగ చిరాకుగా ఉంటుంది. ఇప్పుడు పవన్ పరిస్థితి కూడా ఇదే. ఆయనతో ఫోటోలు దిగటానికి ఆయన అభిమానులు విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు సెల్ఫీలు వద్దంటే చాలు.. సీరియస్ అవుతున్నారట. ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓటు వేయమని బెదిరిస్తున్నారట. ఈ ఇబ్బందికర పరిస్థితిని పవన్ చెబుతూ.. ‘‘సెల్ఫీ ఇవ్వకపోతే ఓటు వేయనని నన్ను బెదిరించకండి. నేను మీ కోసం వచ్చాను. నన్ను పని చేసుకోనివ్వండి. ఫోటో తీసుకోనివ్వలేదని నాపైన కోపం చూపించకండి. మిగిలిన వారు పాతిక కేజీల బియ్యం ఇవ్వాలనుకుంటున్నారు. నేను మాత్రం మీకు పాతికేళ్ల భవిష్యత్తును ఇవ్వాలనుకుంటున్నా’’ అని చెబుతున్నారు. సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో ఇమేజ్ పెంచుకోవాలని తపించే అభిమానులకు.. ‘పాతికేళ్ల’ మాటలు అర్థమవుతాయంటారా పవన్?
Tags:    

Similar News