పవన్ కి కోపం వస్తే బిగ్ ట్రబుల్...?

Update: 2022-04-20 02:30 GMT
జనసేనాని పవన్ కళ్యాణ్ కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా ఉంటారు. ఆయన ఎపుడూ కోరేది తనను వ్యక్తిగతంగా విమర్శలు చేయవద్దు అని. అలాగే తన రాజకీయ సిద్ధాంతాన్ని కూడా విమర్శలు చేయవద్దు అని చెబుతారు. తాను పేదలకు సాయం చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్  చెబుతూంటారు. ఇక పవన్ కళ్యాణ్ మీడియా ముందు మాట్లాడినా, సభలలో ప్రసంగించినా కూడా చెప్పేది ఒక్కటే. తాను ప్రజల కోసం రాజకీయాలు చేస్తాను తప్ప ఎవరి కోసమో కాదని.

సరిగ్గా ఈ పాయింటే పట్టుకుని వైసీపీ నేతలు పవన్ని రెచ్చగొడుతున్నారు. ఒక విధంగా ఆయనతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. పవన్ విషయంలో వైసీపీ చేస్తున్న విమర్శలు, ఆయన్ని ఎదుర్కొంటున్న విధానాన్ని చూస్తే చాలా వ్యూహాత్మకమైన వైఖరి కనిపిస్తుంది. ఇక పవన్ రాజకీయ సిద్ధాంతం లోతుల్లోకి ఎవరూ వెళ్ళకపోయినా నిశిత పరిశీలన చేయకపోయినా ఒక విషయం మాత్రం స్పష్టం.

రాజకీయాల గురించి ఆ మాత్రం అవగాహన ఉన్న వారికి పవన్ శాశ్వత ప్రత్యర్ధి వైసీపీ అనే చెబుతారు. ఇక ఆయన ఎవరితో కలుస్తారు, ఎవరితో స్నేహాలు చేస్తారు అన్నది మాత్రం ఆయన వ్యూహాల మేరకు ఉంటాయి. ఇక ఈ మధ్య పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో ఆవేశపూరితంగా చేసిన ప్రసంగం క్యాడర్ ని బాగా ఆకట్టుకుంది. అయితే పవన్ చివర్లో చెప్పిన కొన్ని విషయాలే మొత్తం స్పీచ్ లోని ఊపును లేకుండా ఉసూరుమనిపించేశాయి.

పవన్ చెప్పిన విషయాలు ఏంటి అంటే వైసీపీ వ్యతిరేక ఓటుని పూర్తిగా ఏకం చేస్తామని చెప్పడం. అలాగే బీజేపీ రోడ్ మ్యాప్ కోసం తాను ఎదురుచూస్తున్నట్లుగా చెప్పడం. ఈ రెండు విషయాల్లోనే ఇపుడు వైసీపీ ఆయన్ని ఒక ఆట ఆడుకుంటోంది. ఇక పవన్ పల్లకీ మోయడానికే పార్టీ పెట్టారు అని అంబటి రాంబాబు నుంచి చాలా మంది నాయకులు విమర్శలు చేస్తూ వస్తున్నారు.

పవన్ ఎవరి ప్రయోజనాల కోసమో మాట్లాడితే తాము జవాబు చెప్పేది ఏంటి అని కొత్త మంత్రులు అంటున్నారు. మొత్తానికి మెల్లగా సర్దుకున్న కొత్త మంత్రులు ఒక్కొక్కరుగా పవన్ మీద హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక వైసీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయితే పవన్ బిక్షా నాయక్ తప్ప భీమ్లా నాయక్ కాదని సంచలన వ్యాఖ్యలే చేశారు. ఇవన్నీ చూసినపుడు పవన్ని టీడీపీ బంధం నుంచి తప్పించాలన్న బలమైన వ్యూహం వైసీపీలో ఉన్నట్లుగా తోస్తోంది.

దీని వల్ల వైసీపీ మైండ్ గేమ్ లో చిక్కుకుని పవన్ సొంతంగా పోటీ చేసినా చేస్తారు, లేకపోతే బీజేపీ బంధంతో ముందుకు సాగుతారు. ఈ రెండింట్లో ఏది జరిగినా అది వైసీపీకి రాజకీయంగా లాభమే. అలా కాకుండా పవన్ టీడీపీతో కలసి ఎన్నికలకు వెళ్తే ఇప్పటి నుంచే జనసైనికుల మెదళ్ళలోకి  ఈ వ్యాఖ్యలను పంపడం ద్వారా ఆ రోజుకు వారిలో నిరాశను పూర్తి స్థాయిలో  పెంచడం మరో ఎత్తుగడ. అంతే కాదు, పవన్ వైపు ఉన్న బలమైన సామాజిక వర్గాన్ని ఎంతో కొంత దూరం చేయడం కూడా టార్గెట్.

మొత్తానికి పవన్ కి కోపం తెప్పించేందుకు వైసీపీ గట్టిగానే ప్రయత్నం చేస్తోంది. పవన్ కి  ఒకవేళ అవేశపడి  ఒంటరి పోరుకు రెడీ అంటే మాత్రం బిగ్ ట్రబుల్ లో పడేది కచ్చితంగా టీడీపీనే. మరి ఈ విషయంలో వైసీపీ ఎత్తుగడలను టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. పవన్ని తమ దారి నుంచి పోనీయకుండా ఎలాంటి పై ఎత్తులు వేస్తుందో కూడా చూడాలి. ఏది ఏమైనా వైసీపీ విమర్శల వల్లనే ఈ మధ్య పవన్ ఎవరి పల్లకీ తాను మోయడంలేదు అని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అది కాస్తా మరింత స్ట్రాంగ్ అయితే మాత్రం సైకిల్ పార్టీకే గాలి పోయేది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News