గంగిరెడ్డికి మరో షాక్ ఇచ్చిన చంద్రబాబు

Update: 2017-01-24 07:28 GMT
కొల్లం గంగిరెడ్డి.. ఎర్రచందనం స్మగ్లింగ్ లో ఇంటర్నేషనల్ డాన్. ఏపీ సీఎం చంద్రబాబుపై అలిపిరి వద్ద జరిగిన దాడిలోనూ ఆయన హ్యాండే ఉంది. ఆ తరువాత ఆయన జైలు నుంచి బయటపడడం.. దేశం నుంచి చెక్కేయడం... మళ్లీ ఎంతో ప్రయాస తరువాత పోలీసులు ఆయన్ను ఇండియాకు రప్పించగలగడం.. ఈ కథంతా తెలిసిందే. అయితే.. ఆయన బుధవారం జైలు నుంచి విడుదల కావాల్సి ఉందట. కానీ.. గంగిరెడ్డి అంటే మండిపడే చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం గంగిరెడ్డికి బయటగాలి పీల్చుకునే అవకాశం లేకుండా కొత్త కేసులతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో బుధవారం గంగిరెడ్డి విడుదలయ్యే ఛాన్సు లేదని చెబుతున్నారు.

చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎర్రచందనం స్మగ్లింగ్‌ కేసులో ప్రత్యేక బృందాలను మారిషస్ పంపి మరీ కొల్లం గంగిరెడ్డిని రాష్ట్రానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం కడప జైల్లో ఉన్న గంగిరెడ్డి ఒక కేసులో శిక్ష అనుభవిస్తున్నారు. ఆ శిక్ష ఈనెల 25కి పూర్తి కానుంది. అదే రోజు గంగిరెడ్డి జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది.  కానీ.. గంగిరెడ్డి బయటకు రాకుండా ప్రభుత్వం కొత్త కేసులు నమోదు చేసింది.

అతడిపై కడప పోలీసులు తాజాగా పీడీ యాక్ట్ నమోదు చేశారు. ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డి బెయిల్‌ పై వచ్చి మారిషస్ పారిపోయిన కేసు కూడా తెరపైకి తెచ్చారు. తాజా కేసుతో గంగిరెడ్డి విడుదల ఉండదని చెబుతున్నారు. కేసులో శిక్షాకాలం పూర్తయినా అది కాగితాల వరకే పరిమితమంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గంగిరెడ్డి బయటకు రాకూడదని ప్రభుత్వ పెద్దలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News