బాబు ఐదేళ్లు ఏం చేశారు.. ఔటర్ రింగ్ రోడ్డుపై నిలదీసిన పేర్ని నాని

Update: 2021-12-17 14:31 GMT
ఔటర్ రింగ్ రోడ్డు కట్టాలంటే 8వేల ఎకరాలు కావాలని ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని చెప్పుకొచ్చారు. దీనిపై చంద్రబాబుకు చెందిన అనుకూల మీడియా ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. 'ఔటర్ రింగ్ రోడ్డుకు ఉరి.. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం' అని ఒక టీడీపీ అనుకూల పత్రికలో వచ్చిన వార్తపై పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఉనికిలో లేని ఔటర్ రింగ్ రోడ్డుపై ఓ దినపత్రిక అబద్దపు రాతలు రాసి ప్రచారం చేస్తోందని తీవ్రంగా విమర్శించారు.

2016లో విజయవాడలో ఔటర్ రింగ్ రోడ్డుపై రిపోర్ట్ తయారు చేశారని.. ముందుగా భూమిని సేకరించమని కేంద్రం స్పష్టం చేసిందని పేర్ని నాని చెప్పుకొచ్చారు. గూగుల్ మ్యాప్ లో గీత గీసి అదే ఔటర్ రింగ్ రోడ్డని చెప్పారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు కనీసం డీపీఆర్ కూడా తయారు చేయలేకపోయారని విమర్శించారు.

ప్రభుత్వంపై బురద జల్లడానికే ఔటర్ రింగ్ రోడ్డును వాడుకుంటున్నారని పేర్ని నాని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక చిన్న అవుటపల్లి నుంచి చిన కాకాని వరకు ఔటర్ రింగ్ రోడ్లు వేయిస్తున్నారని.. చంద్రబాబు ఐదేళ్లలో చిన్న ఫ్లై ఓవర్ కూడా కట్టలేకపోయారని అన్నారు.

విజయవాడ ట్రాఫిక్ కష్టాలు ఎప్పుడైనా చంద్రబాబు పట్టించుకున్నారా? అంటూ పేర్ని నాని ఫైర్ అయ్యారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ కు శంకుస్థాపన చేసిన చంద్రబాబు దాన్ని మధ్యలోనే వదిలేశారని విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక ఫ్లైఓవర్ కు మోక్షం లభించిందని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని జగన్ కు మాత్రమే ఉందని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.

అమరావతి పేరుతో చంద్రబాబు ఇంకా మోసం చేస్తున్నారని..జగన్ మనవాడు కాదు అనుకున్నా.. అభివృద్ధి అంటే ఏంటో చూపాడని.. ప్రజలు అనుకునేలా జగన్ పాలిస్తున్నాడని మంత్రి తెలిపారు.
Tags:    

Similar News