కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పై పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు!

Update: 2023-01-03 02:16 GMT
కేసీఆర్‌ ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పై వైసీపీ మాజీ మంత్రి, బందరు ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు ఏపీని ఏం ఉద్ధరిస్తారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో ఎవరైనా పోటీ చేయొచ్చన్నారు. కేఏ పాల్‌ 175 సీట్లలో పోటీ చేశాడని, అలాగే పవన్‌ కల్యాణ్‌ పోటీ చేశాడని ఎద్దేవా చేశారు. అలాగే బీఆర్‌ఎస్‌ కూడా ఎన్నికల్లో పోటీ చేయొచ్చన్నారు. కాంగ్రెస్, సీపీఐల మాదిరిగానే ఏపీలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఉంటుందని ఎద్దేవా చేశారు.

తెలంగాణ మంత్రులు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల నుంచి దొంగతనంగా కరెంటు తీసుకుంటున్నారని పేర్ని నాని మండిపడ్డారు.

తెలంగాణ మంత్రులు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మోడీ, అమిత్‌ షా ఎప్పుడొస్తారోనని తెలంగాణ మంత్రులు భయంతో ఉన్నారని విమర్శించారు.

ఏపీకి ద్రోహం చేసింది తెలంగాణ నేతలేనని పేర్ని నాని ఆరోపించారు. పోలవరం పూర్తి కాకపోవడానికి, ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి తెలంగాణ నేతలే కారణమని తీవ్ర విమర్శలు చేశారు. ఏపీని తెలంగాణ నేతలే వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపణలు చేశారు.

రాష్ట్ర విభజన జరిగాక ఏపీకి చెందిన ఆస్తులు పంచారా? డబ్బులిచ్చారా? విద్యుత్‌ బకాయిలు చెల్లించారా? అని తెలంగాణ నేతలపై పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని, తప్పకుండా విజయం సాధిస్తుందని తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఏపీలోనూ బీఆర్‌ఎస్‌కు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పిన సంగతి తెలిసిందే. ఏపీలో పోలవరం పూర్తి కాలేదని, ప్రత్యేక హోదా కూడా రాలేదని గుర్తు చేశారు. ఏపీలో బీఆర్‌ఎస్‌ పార్టీ గెలిస్తే.. తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం తరహాలో ఏపీలోనూ పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు.

ఈ నేపథ్యంలో మల్లారెడ్డి వ్యాఖ్యలపై పేర్ని నాని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, పోలవరం పూర్తికాకపోవడానికి తెలంగాణ నేతలే కారణమన్నారు. ఏపీకి ద్రోహం చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News