ఆర్ బీఐ ఎదుట ముఖ్యమంత్రి ధర్నా

Update: 2016-11-18 10:05 GMT
పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో ప్రధాని దేశ ప్రజలకు ఎంత షాకిచ్చారో తెలిసిందే. ఆయన తీసుకున్న నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల్లో అత్యధికులు తొలుత సంతోషం వ్యక్తం చేశారు. రోజులు గడుస్తున్నకొద్దీ.. నోట్ల రద్దు కారణంగా చోటు చేసుకుంటన్న ఇబ్బందులు.. అసౌకర్యాలు సామాన్యులకు సైతం చికాకు తెప్పించేలా ఉంది. అన్నింటికి మించి.. నగరాల్లో ఉండి ప్లాస్టిక్ మనీ చెల్లుబాటుకు వీలున్న వారికి కొంతమేర తిప్పలు తప్పుతున్నా.. పట్టణాలు.. గ్రామాల్లో ఉండే వారికి మాత్రం నోట్ల రద్దు తీవ్ర అసౌకర్యంగా మారింది.

ఏదో ఒకట్రెండు రోజులు ఉంటుందని భావించిన ఇబ్బంది.. రోజుల కొద్దీ సా...గుతున్న వైనం.. రద్దుపై పాజిటివ్ గా ఉన్న వారు సైతం నెగిటివ్ గా మారుతున్నారు. ఇదిలా ఉంటే.. నోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకుల్లో పెద్దనోట్లను మార్పిడి చేసుకునే వీలును తీసివేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక.. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయితే ఏకంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదుట ధర్నాకు దిగటం సంచలనంగా మారింది.

కేరళ సహకరా రంగం నల్లధనానికి నిలయం కాదని.. సహకార రంగ బ్యాంకుల్ని నాశనం చేయటం వల్ల కేరళ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందన్న ఆందోళనను వ్యక్తం చేస్తున్న కేరళ ముఖ్యమంత్రి.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అధికారిక ఫేస్ బుక్ పేజీ ద్వారా కూడా కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రస్థాయిలో తప్పు పట్టారు. ముఖ్యమంత్రే స్వయంగా రంగంలోకి దిగి ఆర్బీఐ ఎదుటకు వచ్చి ధర్నా చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News