డబ్బులున్నోళ్లే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కి వెళ్లాలా?

Update: 2015-10-17 04:52 GMT
సికింద్రాబాద్ స్టేషన్ కు వెళుతున్నారా? అయితే జర జాగ్రత్త. జేబులో చాలీ చాలని డబ్బులతో వెళ్లారా? అడ్డంగా బుక్ అయినట్లే. ఎందుకంటే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు సంబంధించి అధికారులు తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. మామూలుగా రైల్వేస్టేషన్ కు వెళితే ఫ్లాట్ ఫాం టిక్కెట్టు కింద రూ.10 ఛార్జ్ చేస్తారు. అయితే.. దసరా సందర్భంగా పది రోజుల పాటు ఉండే రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ స్టేషన్ ఫ్లాట్ ఫాం టిక్కెట్టును భారీగా పెంచేశారు.

ప్రస్తుతం రూ.10 ఉన్న ఫ్లాట్ ఫాం టిక్కెట్టును రూ.20కు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే..సికింద్రాబాద్ స్టేషన్ లో అడుగు పెట్టాలంటే రూ.20 ఉండాల్సిందే. రిసీవ్ చేసుకోవటానికి.. సెండాఫ్ ఇవ్వటానికి స్టేషన్ కి వెళ్లే వారంతా డబ్బులు భారీగా వదిలించుకోవాల్సిందేనన్న మాట.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఎంఎంటీఎస్ మినిమం రైలు టిక్కెట్టుతో పోలిస్తే కొన్ని రెట్లు ఎక్కువగా ఉన్న ఫ్లాట్ ఫాం టిక్కెట్టు ధరను చూసి పలువురు అవాక్కు అవుతున్నరు. రైలు ఎక్కి ప్రయాణం చేసే కన్నా.. ఆ రైలు ఉండే రైల్వే స్టేషన్ లో ప్రవేశానికి భారీగా ఛార్జ్ చేయటం ఏమిటో..?ఫ్లాట్ ఫాం టిక్కెట్ కొనే బదులు.. ఎంఎంటీఎస్ రైలు టిక్కెట్టు కొంటే సరిపోతుందేమో..?
Tags:    

Similar News