ఆటగాళ్లకు ‘ఆగస్టు 15’ పస్తులు

Update: 2016-08-17 05:20 GMT
ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి ఉండదేమో. ఏదైనా కార్యక్రమం కోసం ఎవరినైనా ఇంటికి పంపితే.. కడుపు నిండా ఆహారం పెట్టి పంపిస్తాం. దేశం కానీ దేశం వచ్చిన ఆటగాళ్లను ఆహ్వానించినప్పుడు.. పసందైన దేశీయ వంటలు వడ్డించాలన్న కనీస స్పృహను కోల్పోయిన యువజన క్రీడా శాఖ తీరు చూస్తే ఆవేశంతో ఒళ్లు మండిపోవటం ఖాయం. ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు రియోకు వెళ్లిన భారతీయ అథ్లెట్లకు చేదు అనుభవం ఎదురైంది. యువజన క్రీడా శాఖ తెలివితక్కువతనం ఆటగాళ్ల కడుపులు మాడిపోయేలా చేశాయి.

ఆగస్టు 15 సందర్భంగా రియోలోని ఇండియన్ ఎంబసీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత అథ్లెట్లను ఆహ్వానించారు. మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న వేడుకలు కావటంతో.. ఆట నుంచి నేరుగా కార్యక్రమానికి హాజరయ్యారు అథ్లెట్లు. ఈ సందర్భంగా ఒలింపిక్స్ విలేజ్ లో ఫుడ్ ఉన్నా.. మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి.. చక్కటి భోజన ఏర్పాట్లు చేసి ఉంటారన్న భావనతో ఒలింపిక్ విలేజ్ లో ఫుడ్ కు నో చెప్పేసి మరీ బయలుదేరారు.

కానీ.. వేడుకలకు వెళ్లిన అథ్లెట్లకు కడుపు కాలేలా వ్యవహరించింది యువజన క్రీడా మంత్రిత్వ శాఖ. పంద్రాగస్టు కార్యక్రమానికి వచ్చిన అథ్లెట్లకు విందును ఏర్పాటు చేయలేదు. గ్లాసుల్లో కూల్ డ్రింక్స్.. తృణ ధాన్యాలు చేతికి ఇచ్చారు. దీంతో.. క్రీడాకారులంతా షాక్ తినే పరిస్థితి. ఆటగాళ్లంతా తనను భోజనం గురించి పదే పదే అడిగారంటూ క్రీడా బృందంలోని ముఖ్య వైద్యాధికారి పవన్ దీప్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై హాకీ క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక.. బాక్సింగ్ క్రీడాకారుల ఆవేశానికి అయితే హద్దే లేకుండా పోయిందని చెబుతున్నారు. పిలిచి మరీ కడుపు మాడిస్తే.. అంతకు మించిన అవమానం ఏముంటుంది? అతిధులుగా వచ్చే ఆటగాళ్లకు ఫుడ్ పెట్టకూడదనుకుంటే.. ఆ విషయాన్ని ఆహ్వానంలోనే స్పష్టం చేసి ఉంటే ఇష్యూ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు. అప్పుడు తప్పు యువజన క్రీడాశాఖది కాకుండా ఆటగాళ్లదే అయి ఉండేది. వేడకకు కడుపునిండా ఫుడ్ పెట్టకూడదన్న దరిద్రపు నిర్ణయం ఎవరు తీసుకున్నట్లు..?
Tags:    

Similar News