గతం ఇంకెన్నాళ్లు పోచారం సాబ్..?

Update: 2016-11-19 04:39 GMT
పవర్ లోకి రావటానికి అధికారపక్షాన్ని తిడతారు. పవర్ లోకి వచ్చాక.. అధికారం పోయి పుట్టెడు శోకంలో మునిగిపోయిన ప్రతిపక్షాన్ని తిట్టిపోస్తారు. మొత్తంగా ఎప్పుడూ తిట్టిపోయటమే కానీ.. నిజాలు చెప్పటం అన్నది రాజకీయ నాయకులకు ఉండదా? అన్న డౌట్ వచ్చే పరిస్థితి. ప్రతి విషయాన్ని అడ్డదిడ్డంగా మాట్లాడేయటం.. తాము మాట్లాడే మాటల్ని కోట్లాది మంది ప్రజలు వింటున్నారన్న భయం భక్తి అన్నది నేతలకు లేకుండా పోతోంది. పవర్ లోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా. . ఇంకా విపక్షాలపై విరుచుకుపడటం.. వారు చేసిన తప్పుల్ని ఎత్తి చూపిస్తూ కాలం గడిపేయటమే తప్పించి.. తాము ఏమేం చేస్తున్నామన్న ధోరణి మాత్రం అస్సలు కనిపించదు. ఇందుకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు తెలంగాణ రాష్ట్ర మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయం కోసం విపక్షాలు అబద్ధాలు చెబుతున్నాయని అనుకున్నా.. వారు లేవనెత్తిన వాస్తవాలపై మాత్రం సూటిగా సమాధానాలు చెప్పలేని పరిస్థితి తెలంగాణ అధికారపక్షంలో కనిపిస్తుంది. ప్రజల సంక్షేమం తప్పించి.. మరేదీ తమకు ముఖ్యం కాదని ప్రభుత్వాలు అనుకుంటే.. గత ప్రభుత్వాలు మొదలు పెట్టి.. పూర్తి చేసే దశలోకి వచ్చిన ప్రాజెక్టులను తొలుత పూర్తి  చేయకుండా.. తమదైన ప్రాజెక్టులను ఎందుకు తెర మీదకు తీసుకురావటం?

కొత్తవి వద్దని చెప్పటం లేదు. అదే సమయంలో పాతవాటిని కూడా పూర్తి చేయాలన్నదే అసలు వాదన. అదే విషయాన్ని ప్రస్తావిస్తున్న ప్రతిపక్షంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలంగాణ అధికారపక్షంలో కనిపిస్తుంది. ఒకవేళ విపక్షాలు విరుచుకుపడితే.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లనే దారుణాలన్నీ జరుగుతున్నట్లుగా విమర్శిస్తారు. వారు కానీ బాగా చేసి ఉంటే.. తమ చేతికి పవర్ వచ్చేదే కాదన్న వాస్తవాన్ని మాత్రం అస్సలు పట్టించుకోని వైనం తెలంగాణ అధికారపక్షంలోకనిపిస్తుంది.

ప్రజలు తమకిచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో ఇప్పటికే సగం పూర్తి అయిపోయిన నేపథ్యంలో.. ఇంకా గత ప్రభుత్వాలంటూ ప్రధానప్రతిపక్షంపై విరుచుకుపడటంలో అర్థం ఏమైనా ఉందా? అన్నదే అసలు ప్రశ్న. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడుతున్నారు. తెలంగాణలో 1.14 కోట్ల హెక్టార్ల వ్యవసాయ భూమి ఉన్నా.. 67 లక్షల హెక్టార్లే సాగులో ఉండటం కాంగ్రెస్ వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా మండిపడ్డ పోచారం.. గడ్డాలు పెంచుకొని.. పాదయాత్రలు చేస్తే ప్రజలు నమ్మరని చెప్పుకొచ్చారు. పోచారం చెప్పిన దాన్లో నిజం ఉంది. అదే సమయంలో ఆయన చెప్పినట్లుగానే.. గడిచినరెండున్నరేళ్ల వ్యవధిలో తెలంగాణ అధికారపక్షం ఎంత భూమిని అదనంగా సాగులోకి తెచ్చిందన్న విషయం కూడా చెబితే బాగుండేది కదా? అసలు పాయింట్ చెప్పకుండా.. విపక్షాల మీద విరుచుకుపడితే ఎలా చెప్పండి పోచారం సాబ్..?

 
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News