కరోనాకు బినామీలు - ఓ మై గాడ్

Update: 2020-06-29 17:30 GMT
ఏదేమైనా మన తెలుగు వాళ్లకి భలే ఐడియాలు వస్తాయండీ. కరోనా విషయంలోను అతి తెలివిని ప్రదర్శిస్తున్నారు. ఇది ఒకరకంగా భయం, ఇంకో రకంగా బడాయి. ఇంతకాలం దొంగ సొమ్ముకే బినామీలను చూస్తున్నాం. ఇపుడు కరోనా టెస్టులకు కూడా బినామీలను వాడుకుంటున్నారట. అదెలా సాధ్యం అనుకుంటున్నారమే... బినామీ ఆస్తులైనా, బినామా పరీక్షలైనా పెద్దోళ్లకేగా అవసరం. వారు తలచుకుంటే కానిదేముంది చెప్పండి. ఇక పరీక్షలు చేసేది ప్రైవేటు ల్యాబులు. చిటికెలో పని కదా ఇక.

ఇపుడైతే కొందరు నేతలు తమకు కరోనా వచ్చిందని చెబుతున్నారు గాని కొత్తలో చెప్పేవారు కాదు. ఇలా ఏపీలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడి హైదరాబాదు కార్పొరేటు ఆస్పత్రులకు వచ్చి రహస్యంగా చికిత్సలు చేసుకుని వెళ్లారు. వారికి ఏమీ కాలేదు కాబట్టి అది రహస్యంగానే ఉండిపోయింది. లేకపోతే కేసులు ఎపుడో బయటపడేవి.

ఏపీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు అది ఏ పార్టీ వారయినా స్వేచ్చగా బయట తిరిగేస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు బయటకు వస్తే వారి అనుచరులు లేకుండా రారు కదా. ఇక వ్యాపార కలయికలు, డీల్స్ మామూలే. ఇలా వర్క్ ఫ్రం హోం చేసుకునే సామాన్యుల కంటే పెద్దవాళ్లే ఎక్కువ బయట తిరుగుతున్నారు. ఈ క్రమంలో వారు కరోనా బారిన పడటం మొదలైంది.

ఎందుకైనా మంచిదని ఇలా బయట తిరుగుతున్న బడా నేతలు, వ్యాపారులు అనుమానాలున్న వారు టెస్టులు చేయించుకుంటున్నారు. వీరిలో కొందరు ఎందుకు బయటపడటం... టెస్టు చేశాక పాజిటివ్ వస్తే సైలెంటుగా ఫాం హౌస్ కి పోదాం, రాకపోతే హ్యాపీ అని తమ పనివాళ్ల పేరు మీద తమ నమూనాలు చెక్ చేయించుకుంటున్నారు. ఈ ట్రెండ్ విని జనం నోరెళ్లబెట్టడమే తరువాయి.
Tags:    

Similar News