ఎన్నికల రణ ‘నినాదాలు’..

Update: 2021-12-21 11:15 GMT
రాజకీయాల్లో.. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో నినాదాలు ఎంతటి కీలక పాత్ర పోషిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. 1970ల్లో.. ఇందిరాగాంధీ ఇచ్నిన ‘‘గరీబీ హఠావో’’నినాదం 1971 లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు అఖండ విజయ అందించింది. నాడు 521 సీట్లకు గాను 518 స్థానాలకు ఎన్నికలు జరిగితే.. ఇందిరా సారథ్యంలోని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్).. 352 సీట్లు గెలిచింది.

నాడు ఉన్న పరిస్థితుల్లో పేదరికమే ప్రధాన సమస్య. దీనిని అందిపుచ్చుకున్న ఇందిరా సూటిగా బాణం వదిలారు. అయితే, నాటి ఎన్నికల్లో రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ఇందిరా గాంధీ గెలుపు చెల్లదంటూ కో్ర్టు తీర్పు చెప్పడంతో ఆమె 1975లో అత్యవసర పరిస్థితి విధించి చెడ్డ పేరు తెచ్చుకున్నారు.

తదనంతరం జరిగిన ఎన్నికల్లో (1977) ఘోర పరాజయం పాలయ్యారు. ఈ ఎన్నికల్లో హీరోగా నిలిచింది జయప్రకాశ్ నారాయణ్ (జేపీ). లోక్ నాయక్ గా ప్రఖ్యాతిగాంచిన జేపీ.. 1977 ఎన్నికల సందర్భంగా.. ‘‘ఇందిరా హఠావో.. దేశ్ బచావో’’ నినాదం అందించారు. 1971 ఎన్నికల్లో ఇందిర నినాదానికి సమీపంగా.. అర్థంలో పూర్తి భిన్నంగా ఉన్న ఇది బాగా పాపులర్ అయింది. భారీ మెజార్టీతో జనతా ప్రభుత్వం ఏర్పాటైనా.. వేర్వేరు కారణాలతో అది మూడేళ్లలోనే పడిపోయింది.

మళ్లీ ఇందిరానే గద్దెనెక్కారు. ఆమె దారుణ హత్యకు గురైన అనంతరం జరిగిన 1984 లోక్ సభ ఎన్నికల్లో ప్రత్యేక నినాదం మార్మోగింది. అదేంటంటే.. ‘‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా.. ఇందిరా తేరా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఇందిరా పేరు నిలిచి ఉంటుంది)’’. అప్పటికే ఇందిరా దారుణ హత్యకు గురైన నేపథ్యంలో ఈ నినాదం సెంటిమెంట్ మీద కొట్టినట్టయింది. దీంతో కాంగ్రెస్ 400 పైగా సీట్లు సాధించింది.

బీజేపీ స్లో ‘గన్’లూ పేలాయి...

కాంగ్రెస్ నుంచి నినాదాల సంప్రదాయం అందిపుచ్చుకున్న బీజేపీ ఎన్నికల సందర్భంగా వాటిని ప్రయోగించడం మొదలుపెట్టంది. ‘‘బారీ బారీ సబ్ కీ బారీ.. అబ్ కీ బారీ అటల్ బిహారీ ’’ .. 1996లోక్ సభ ఎన్నికల సందర్భంగా యూపీలోని లక్నో నగరం నుంచి మాజీ ప్రధాని వాజ్ పేయి పోటీ సందర్భంగా ఈ నినాదాన్ని తెచ్చారు. నాడు ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం . అయితే, అనూహ్య పరిణామాలతో కేవలం 13 రోజులు మాత్రమే కొనసాగింది.

1998 ఎన్నికల అనంతరం ఇదే బీజేపీ ప్రభుత్వాన్ని నెలకొల్పినా.. 13 నెలలే అధికారంలో ఉంది. అదే సమయంలో కార్గిల్ యుద్ధం రావడంతో దేశభక్తి పవనాలతో గెలుపొందింది. నాటి ఎన్నికల్లోనూ ‘‘అటల్ బిహారీ ఔర్ ఏక్ బారీ’’ (వాజ్ పేయికి మరోసారి ఓటెయ్యండి) నినాదం దద్దరిల్లింది. కానీ, 2004కు వచ్చేసరికి బీజేపీ (ఎన్డీఏ) ఎత్తుగడలు పారలేదు. నాటి కరువు రోజుల్లో .. ‘‘భారత్ వెలిగిపోతోంది’’ అంటూ చేసిన ప్రచారం.. వారికే దెబ్బకొట్టింది.

సోనియాను రెండో ఇందిరాగా పోలుస్తూ

2004లో విజయ దుందుభి మోగించిన కాంగ్రెస్ పార్టీ యూపీఏ పేరిట కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2009 ఎన్నికలకు వచ్చేసరికి వారికి వామపక్షాలు దూరమయ్యాయి. ప్రతిష్ఠాత్మకంగా మారిన ఆ ఎన్నికల్లో సోనియాను కాంగ్రెస్ శ్రేణులు మరో ఇందిరా గాంధీగా పోల్చాయి.. ‘‘ సోనియా నహీ యే ఆంధీ హై. దూస్రీ ఇందిరా గాంధీ హై’’ అంటూ నాటి ఎన్నికల్లో ముందుకెళ్లాయి.

అన్నిటికి మించి.. సమోసా మే ఆలూ.. లాలూ..

బిహార్ తో పాటు దేశ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన లాలూ ప్రసాద్ యాదవ్.. బిహార్ లో సుదీర్ఘ కాలం సీఎం గా చేశారు. ఓ ఎన్నికల సందర్భంగా ఆయన ‘‘సమోసాలో ఆలూ.. బిహార్ మే లాలూ’’ నినాదంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఇప్పటివరకు వచ్చిన అన్ని ఎన్నికల స్లోగన్స్ లో దీనినే అత్యంత హాస్యభరితమైనదిగా చెప్పుకొంటారు.

మోదీని ముందుకు నెట్టిన నినాదం

200-2014 మధ్య యూపీఏ ప్రభుత్వ విధానాలతో విసిగిపోయిన ప్రజలకు.. గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ ఓ ఆశా దీపంగా కనిపించారు. దీనిని బీజేపీ శ్రేణులు తగినట్టుగా వాడుకున్నాయి. ‘‘ఆబ్ కీ బార్ మోదీ సర్కార్’’ నినాదంతో ఈసారి మోదీ ప్రభుత్వం కావాలని ప్రచారం చేశాయి. ఇది బ్రహ్మాండంగా పేలింది. ఇదే సమయంలో అచ్చే దిన్ ఆయేగా అంటూ మంచి రోజులు వస్తాయని ప్రచారం చేశారు.

యూపీ ఎన్నికలకు మోదీ భలే నినాదం

2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ఎంత ప్రతిష్ఠాత్మకమో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో గెలుపు ప్రభావం 2024 లోక్ సభ ఎన్నికలపై చాలా ఉంటుంది. దీంతో యూపీని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ ఇప్పటికే పదిసార్లు యూపీలో పర్యటించి పదుల సంఖ్యలో ప్రగతి కార్యక్రమాలను ప్రారంభించారు.

ప్రఖ్యాత కాశీ లో చేపట్టిన పనులనూ ప్రారంభించారు. కాగా, కొద్ది రోజుల క్రితం మోదీ యూపీ ఎన్నికలకు ప్రత్యేక నినాదం ఇచ్చారు. ‘‘యూపీ ప్లస్ యోగి.. ఉపయోగి’’ అంటూ ఆయన ఇచ్చిన నినాదం పేలింది.

మళ్లీ ఎలాగైనా యూపీలో కాషాయ జెండా ఎగురవేయాలని లక్ష్యం పెట్టుకున్న బీజేపీకి ఈ నినాదం ఊపునిచ్చేలా ఉంది. యూపీలో గూండారాజ్ ను అణిచివేస్తూ.. అభివ్రద్ధిలోనూ తనదైన ముద్ర చూపుతున్న యోగి సర్కారుకు ఇది సరైన నినాదంగా నే కనిపిస్తోంది. అయితే, అక్కడ బీజేపీకి సమాజ్ వాదీ పార్టీ నుంచి పెద్ద సవాల్ ఎదురవుతోంది.

బహుజన సమాజ్ పార్టీ పెద్దగా సోయిలో లేదు. కానీ సమాజ్ వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ దీటుగా నిలుస్తున్నారు. బీజేపీ నుంచి ఆ పార్టీలోకి వలసలు కూడా మొదలయ్యాయి. తాజాగా మోదీ ఇచ్చిన యూపీ ప్లస్ యోగి.. ఉపయోగి నినాదానికి యూపీ ప్లస్ యోగి నిరుపయోగి అంటూ అఖిలేశ్ కౌంటర్ ఇచ్చారు. చూద్దాం..ఈ సారి ఏ నినాదం పేలుతుందో?

అసలైన కొసమెరుపు..

ఇప్పటివరకు చెప్పుకొన్న అన్ని ఎన్నికల నినాదాలు ఒక ఎత్తు.. 1967 ఎన్నికల సందర్భంగా భారతీయ జన సంఘ్ (నేటి బీజేపీ పూర్వ సంస్థ) ఇచ్చిన నినాదం ఒక ఎత్తు. అప్పటికి దేశంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ ను ఉద్దేశించి జన సంఘ్ ఈ నినాదం చేసింది. ‘‘బీడీ మే తంబాకు హై.. కాంగ్రెస్ వాలా డాకూ హై’’ అంటూ బీడీలోని పొగాకుతో కలిగే ప్రమాదాన్ని వివరించింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో దొంగలు (డాకూ) ఉన్నారంటూ హెచ్చరించింది.
Tags:    

Similar News