నేతలకు డోప్ టెస్ట్ లు తప్పనిసరంటున్న మంత్రి

Update: 2015-08-17 05:15 GMT
ఆటగాళ్లు మత్తు పదార్థాలు తీసుకున్నారా? లేదా? అన్న విషయాల్ని తేల్చేందుకు టెస్ట్ లు నిర్వహించటం కామన్. కానీ.. అలాంటి డోప్ టెస్ట్ లను రాజకీయ నాయకులకు కూడా ‘‘తప్పనిసరి’’ చేయాలని చెబుతూ పంజాబ్ రాష్ట్ర మంత్రి ఒక సంచలనం సృష్టిస్తున్నారు.

పంజాబ్ రాష్ట్ర వ్యవసాయ మంత్రి తోతాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఎన్నికల సమయంలో.. నామినేషన్ వేసే ప్రతి రాజకీయ నాయకుడికి డోప్ టెస్ట్ చేయించాలని.. ఒకవేళ మత్తుపదార్థాలు.. నిషేధిత పదార్థాలు తీసుకుంటున్నట్లు తేలితే.. అతన్ని ఎన్నికలకు అనుమతించకూడదని వ్యాఖ్యానించారు.

పంజాబ్ రాష్ట్రంలో పెరిగిపోయిన మాదక ద్రవ్యాల వినియోగానికి చెక్ పెట్టేందుకు ఇదో కీలక చర్యగా తన డోప్ టెస్ట్ ప్రతిపాదనను సమర్థించుకున్నారు. ఆటగాళ్ల విషయంలో కెప్టెన్ తో సహా అందరూ డోప్ టెస్టులు చేయించుకుంటారని.. అలాంటప్పుడు.. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించే ప్రతిఒక్కరికి డోప్ టెస్ట్ లు ఎందుకు నిర్వహించకూడదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు డోప్ టెస్టులు నిర్వహించాలా? వద్దా? అన్న మాటను కాసేపు పక్కన పెడితే.. ఒక మంత్రి నోటి వెంట అలాంటి మాట రావటానికి దారి తీసిన అంశాల మీద దృష్టి పెడితే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News