టీఆర్ ఎస్ లో భగ్గుమన్న విబేధాలు

Update: 2018-10-11 10:45 GMT
టీఆర్ ఎస్ లో ఎంపీకి - మాజీ ఎమ్మెల్యే మధ్య చెలరేగిన విబేధాలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఒకే పార్టీలోని కార్యకర్తలు రెండుగా చీలిపోయారు. ఇది కొట్టుకునే స్థాయి వరకు చేరింది. ఇరు వర్గాలు ఒకరికిపై ఒకరు పోటీగా నినాదాలు - వ్యతిరేక పాటలతో ప్రతిరోజు నియోజకవర్గంలో హోరెత్తిస్తున్నారు. ఈ పరిణామం తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు తెగ సంబరపడిపోతున్నారు.

ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి - వైరా మాజీ ఎమ్మెల్యే మదనల్ లాల్ మధ్య రాజకీయ విబేధాలు ఉన్నాయి. ఇద్దరు టీఆర్ ఎస్ లోనే ఉన్నారు. గతంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం బాగానే ఉండేది. ఆ తరువాత ఏర్పడిన విభేదాలు వ్యక్తిగతంగా - రాజకీయంగా దూరం చేశాయి. ప్రస్తుతం టీఆర్ ఎస్ అధిష్ఠానం మదన్ లాల్ కు ఈ సారి కూడా వైరాలో టిక్కెట్ ను కేటాయించింది.

ఇది మింగుడపడని ఎంపి పొంగులేటి మండిపడ్డారు.  బహిరంగంగానే విమర్శలు చేస్తూ వైరా అంతటా మదనల్ లాల్ కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కట్టించేశారు. అతనికి ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే కార్యకర్తలు ఎవరూ ఓట్లు వేయవద్దని ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంపీ - మాజీ ఎమ్మెల్యే అనుచరులు రెండు వర్గాలు విడిపోయారు. ఓ పార్టీ కార్యక్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు చేరింది.

మరోవైపు టీఆర్ ఎస్ అధిష్ఠానం పార్టీ అభ్యర్థులను మార్చేది లేదని తెగేసి చెప్పేసింది. ఎంపీ మాత్రం మార్చాల్సిందేనని పట్టువీడటం లేదు. వైరాలో చెలరేగిన రాజకీయ గొడవను చల్లార్చేందుకు టీఆర్ ఎస్ నేతలు ప్రయత్నించినా కుదరడం లేదు. ఈ వ్యవహారం తమకు బాగా కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతలు సంబరపడిపోతూ - ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తూ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.
Tags:    

Similar News