పొన్నం గారూ!... ఇవేం ఆరోప‌ణ‌లండీ!

Update: 2019-01-27 10:28 GMT
తెలంగాణ అసెంబ్లీకి జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యంతో గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ కు చెందిన నేత‌ల‌కు దిమ్మ తిరిగిపోయింద‌నే చెప్పాలి. త‌మ గెలుపు కోసం కాకుండా కేసీఆర్ ఓట‌మే ల‌క్ష్యంగా సాగిన కాంగ్రెస్ నేత‌లు.. సిద్ధాంతాలు ప‌క్క‌న‌పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై రెండు నాల్క‌ల ధోర‌ణితో ముందుకు సాగిన టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో పొత్తు క‌ట్టారు. చంద్ర‌బాబుతో పొత్తు లేకుండా ఉండి ఉంటే.. క‌నీసం గౌర‌వంగా అయినా ఓడిపోయేవారేమో. తెలంగాణ వ్య‌తిరేకి అన్న ముద్ర వేసుకున్న చంద్ర‌బాబుతో పొత్తు కాంగ్రెస్‌ కు గ‌ట్టి దెబ్బ త‌గిలింది. ఈ దెబ్బ‌తో స‌మీప కాలంలో కాంగ్రెస్ కోలుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఫ‌లితంగా ఆ పార్టీ నేత‌లు ఇప్పుడు పూర్తిగా ఫ‌స్ట్రేష‌న్‌ లో కూరుకుపోయార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇందుకేనేమో... స‌ద‌రు పార్టీ నేత‌ల నుంచి వ‌స్తున్న మాటల్లోనూ ప‌స లేకుండా పోయింది. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గానే ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌ - మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు నిలుస్తున్నాయి.

పొన్నం ప్ర‌భాక‌ర్... ఎంపీగా ఉన్న స‌మ‌యంలో తెలంగాణ ఆవ‌శ్య‌తలో అయినా - ఇంకే అంశం అయినా అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌మే కాదు... త‌న వాద‌న‌ను బ‌ల‌ప‌ర‌చుకునేందుకు ఆయ‌న చేసే వాద‌న కూడా చాలా ప‌క‌డ్బందీగానే ఉండేది. పొన్నం ఎంట్రీ ఇచ్చారంటే... అవ‌తలి వ్య‌క్తి ఒక‌టికి రెండు సార్లు ఆలోచించి మ‌రీ బ‌రిలోకి దిగాల్సిన ప‌రిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీకి త‌గిలిన గ‌ట్టి దెబ్బ ఫ‌లితంగా పొన్నం వాద‌న‌ ప‌స లేనిదిగా మారిపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా ఇప్పుడు పొన్నం విష‌యం ఎందుకంటే... నిన్న గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ హైద‌రాబాదులోని రాజ్ భ‌వ‌న్ లో *ఎట్ హోం* పేరిట ఏటా ఏర్పాటు చేసే విందును భారీగా నిర్వ‌హించారు. ఈ విందుకు తెలంగాణ‌తో పాటుగా ఏపీకి చెందిన సీఎంలు, విప‌క్ష నేత‌లు, రెండు రాష్ట్రాల‌కు చెందిన అధికార‌, రాజ‌కీయ‌, ఇత‌ర రంగాల ప్ర‌ముఖుల‌ను ఆహ్వానించ‌డం ఆన‌వాయితీనే క‌దా. ఆ మేర‌కే రెండు రాష్ట్రాల్లోని ప్ర‌ముఖులంద‌రికీ గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం నుంచి ఆహ్వానాలు అందాయి. ఈ ఆహ్వానాల‌ను కొంద‌రు మ‌న్నిస్తే... కొంద‌రు గైర్హాజ‌ర‌య్యారు.

గైర్హాజ‌రీని ప‌క్క‌నపెడితే.. విందుకు వ‌చ్చిన వారిలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సెంట‌రాఫ్ అట్రాక్ష‌న్‌ గా నిలిచార‌ని చెప్పాలి. ఈ విందుకు హాజ‌రైన కేసీఆర్‌ - కేటీఆర్‌ ల‌తో పాటు ఇత‌ర నేత‌ల‌తోనూ ముచ్చ‌టిస్తూ ప‌వ‌న్ సంద‌డి చేశారు. ఈ విందుపై విమ‌ర్శ‌లు గుప్పించేందుకు రంగంలోకి దిగిన పొన్నం ప్ర‌భాక‌ర్‌.. రాజ్‌ భవన్‌ అప్రజాస్వామిక చర్యలకు వేదికగా మారిందని త‌న‌దైన శైలి ఆరోప‌ణ‌ల‌తో మండిపడ్డారు. తెలంగాణను వ్యతిరేకించిన జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తో సీఎం కేసీఆర్‌ ఎలా చర్చలు జరుపుతారని ఆయ‌న‌ ప్రశ్నించారు. ఇలాంటి చర్యలతో రాజ్‌ భవన్‌కు ఉన్న విలువను తగ్గిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప‌నిలో ప‌నిగా మోదీని కూడా లాగేసిన పొన్నం... ప్రధాని నరేంద్ర మోదీకి కేసీఆర్‌ ఏజెంట్‌లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తం ఏకకాలంలో ఎన్నికలనే నినాదం ఎత్తుకున్న మోదీ.. తెలంగాణలో మాత్రం కేసీఆర్‌ కోసమే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు సహకరించారని ఆరోపించారు. ఇలా సాగిన పొన్నం విమ‌ర్శ‌ల్లో ఏమైనా ప‌స ఉందా అన్న‌ది ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌శ్న‌. ఉమ్మ‌డి రాష్ట్ర గ‌వ‌ర్నర్ ఇచ్చే విందుకు ఏపీ నేత‌లు రాకూడ‌ద‌న్న కోణంలో చేసిన పొన్నం విమ‌ర్శ‌లు నిజంగానే అర్థర‌హిత‌మ‌న్న వాద‌న వినిపిస్తోంది.

Tags:    

Similar News