పవన్ కి పవర్ ఫుల్ సవాల్.. ?

Update: 2021-11-24 08:30 GMT
పవన్ కళ్యాణ్. సినిమాల్లో పవర్ స్టార్. రాజకీయాల్లో ఆయన ఇంకా అడుగులు వేస్తూనే ఉన్నారు. ఆయన జనసేన పార్టీ పెట్టి ఏడేళ్ళు అయింది. రాజకీయాల్లోకి వచ్చి పదమూడేళ్ళు అయింది. అయితే పవన్ ఈ రోజుకీ ఏపీ రాజకీయాల్లో ధీటుగా నిలబడలేకపోతున్నారు అన్న చర్చ అయితే గట్టిగా ఉంది. ఇక మరో రెండున్నరేళ్ళలో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. పవన్ కళ్యాణ్ పార్టీ ఇంకా ఎక్కడా పటిష్టం కాలేదు. దీంతో మరో మారు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తులు పెట్టుకుంటారు అన్న ప్రచారం అయితే ఉంది. ఈ మేరకు రెండు పార్టీల మధ్య సామరస్య వాతావరణం ఉందని కూడా చెబుతున్నారు. ఈ మధ్యన జరిగిన పరిషత్తు ఎన్నికల్లో కూడా కొన్ని జిల్లాల్లో పొత్తులు కొనసాగాయి. దాంతో పవన్ మళ్ళీ పొత్తుల పార్టీగానే మిగిలిపోతారా అన్న సందేహాలు కూడా ఉన్నాయి.

ఈ నేపధ్యంలో మంత్రి పేర్ని నాని పవన్ రాజకీయ ప్రస్థానం గురించి. ఆయన ముఖ్యమంత్రి అయ్యే చాన్సుల గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి పేర్ని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్న ప్రశ్న కాదిక్కడ, ముందు ఆయన ఏపీలోని 175 సీట్లకు సొంతంగా పోటీ చేయాలని సవాల్ చేశారు. పవన్ ముందు సొంతంగా పార్టీని గట్టి చేసుకుని ఎన్నికల బరిలో దిగితే జనాలు ఆయన ముఖ్యమంత్రి అవుతారో లేదో చెబుతారని అన్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో నిలకడ లేని వారిగా మిగిలారని నాని సెటైర్లు వేశారు.

తన దగ్గర డబ్బులు లేవని ఒకమారు చెప్పే పవన్, మరో మారు తాను వందల కోట్ల పారితోషికం తీసుకునేవాడిని వదిలి రాజకీయాల్లోకి వచ్చానని అంటారని గుర్తు చేశారు. సినిమాలు మానేశాను అని ఒకసారి చెబుతూ సినిమాలు మళ్లీ చేసుకుంటున్నారని పేర్ని అన్నారు. పవన్ నిలకడగా ఉంటే ఆయన రాజకీయం ఏంటి అన్నది జనాలే డిసైడ్ చేస్తారని అన్నారు. పవన్ తనను పదే పదే విమర్శించడం అంటే తాము ఆయనకు చులకనగా కనిపించి ఉండవచ్చు అని ఎద్దేవా చేశారు. ఇక పవన్ కళ్యాణ్ కాపులను కన్సాల్డేట్ చేసే అవకాశాల మీద మాట్లాడుతూ ఏ కులం లోనైనా కులాభిమానం ఉన్న వారు కొంతమంది ఉంటారని వారిని ఆయన అట్రాక్ట్ చేస్తే చేయవచ్చు అన్నారు.

మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ ఇలా ఎన్ని పార్టీలు కలసి వచ్చినా వైసీపీ సింగిల్ గానే జనాలలోకి వస్తుందని, ప్రజల మద్దతుతోనే మరోసారి విజయం సాధిస్తుంది అని పేర్ని నాని చెప్పారు. తమకు అవతల వారు ఏం చేస్తున్నారు, ఎవరి రాజకీయాలు ఏంటి అన్న ఆలోచన ఉండదని, ప్రజల గురించే తాము ఆలోచిస్తామని నాని అంటున్నారు. మొత్తానికి పవన్ ఒంటరిగా పోటీ చేయగలడా అంటూ పేర్ని నాని చేసిన సవాల్ ని ఆయన ఎలా స్వీకరిస్తారో చూడాల్సిందే.
Tags:    

Similar News