కాంగ్రెస్‌లోకి ప్ర‌శాంత్ కిశోర్‌.. ఆయ‌న బీజేపీ కోవ‌ర్ట్‌.. సీనియ‌ర్ల హెచ్చ‌రిక‌!

Update: 2021-07-30 23:30 GMT
రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌.. ప్ర‌శాంత్ కిశోర్‌ను కాంగ్రెస్‌లోకి తీసుకునే ప్ర‌తిపాద‌న వేగం పుంజుకుంది. ఆయ‌న‌ను కాంగ్రెస్‌లోకి తీసుకుని.. ఆయ‌న చెప్పిన‌ట్టు వింటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంద‌ని.. పార్టీ నాయ‌కుడు, గాంధీల వార‌సుడు.. రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్‌లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి.. పోస్టును ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టాల‌ని కూడా చూస్తున్నారు. 2014లో దేశ రాజ‌కీయ తెర‌మీద‌కు వ్యూహ‌క‌ర్త‌గా అడుగు పెట్టిన ప్రశాంత్ కిశోర్‌.. ఆ ఎన్నిక‌ల్లో అప్ప‌టి గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోడీని ఢిల్లీ పీఠం కూర్చోబెట్ట‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. ఆ త‌ర్వాత‌.. ఏపీలో జ‌గ‌న్‌ను సీఎం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ప‌నిచేసి స‌క్సెస్ సాధించారు.

ఆ త‌ర్వాత బీహార్‌లో నితీశ్ కుమార్‌యాద‌వ్‌ను, ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్‌లో మ‌మ‌తా బెన‌ర్జీని.. మ‌ళ్లీ సీఎం సీటులో కూర్చోబెట్టి త‌న స‌త్తా చాటుకున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌ల‌ను కాంగ్రెస్ వాడుకుని.. ఆయ‌న వ్యూహాల మేర‌కు అడుగులు వేయ‌డం ద్వారా.. వ‌చ్చే 2024 ఎన్నిక‌ల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువ‌చ్చేందుకు అవ‌కాశం ఉంద‌ని.. రాహుల్ భావిస్తు న్నారు. మ‌రోవైపు.. ప‌లువురు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు కూడా ఇదే సూచిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఏకంగా.. ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకుని.. కీల‌క‌మైన ప‌ద‌వి ఇచ్చి.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టార్గెట్ చేయాల‌నేది.. రాహుల్ యోచ‌నా ఉంది. ఈ క్ర‌మంలో ఆయ‌న సీనియ‌ర్ల‌తో మంత‌నాలు చేస్తున్నారు.

ప్ర‌స్తుతం దేశంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త పెరుగుతున్న మాట వాస్త‌వం. అయితే.. కాంగ్రెస్‌పై సానుభూతి పెరుగుతోం దా? అంటే.. లేద‌నే చెప్పాలి. ఒక‌వేళ పెరిగినా.. దానిని స‌రిగా క్యాష్ చేసుకునేందుకు కాంగ్రెస్ నాయ‌కులు దూకుడుగా వ్య‌వ‌హ రించ‌డం లేదు. దీనిని స‌రిచేయ‌కుండానే ప్ర‌శాంత్ కిశోర్‌ను తీసుకువ‌చ్చి.. పార్టీని ప‌ట్టాలెక్కించేందుకు రాహుల్ ప్ర‌య‌త్నిస్తున్నా రు. ఇక‌, ప్ర‌శాంత్ విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న ఇటీవ‌ల కాలంలో బీజేపీని విమ‌ర్శిస్తున్నారు. బీజేపీని గ‌ద్దెదించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని.. ప్ర‌చారం చేస్తున్నారు. కానీ.. ప‌రిశీల‌కులు స‌హా.. కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు మాత్రం ప్ర‌శాంత్ కిశోర్‌.. బీజేపీని విమ‌ర్శిస్తున్నా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి ఆయ‌న న‌మ్మిన బంట‌ని.. ఇప్ప‌టికీ.. మోడీకి ట‌చ్‌లో నే ఉన్నార‌ని చెబుతున్నారు.

కేవ‌లం.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా వంటివారితోనే ప్ర‌శాంత్ కిశోర్‌కు వ్య‌తిరేక‌త ఉంద‌ని.. చెబుతున్నారు. అంతేకాదు.. 2014లో అస‌లు ప్ర‌శాంత్ కిశోర్‌ను రాజ‌కీయ తెర‌మీదికి తీసుకువ‌చ్చిందే.. ప్ర‌ధాని అనే విష‌యాన్ని మ‌రిచిపోరాద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అంటే.. ఆయ‌న మోడీ వ్య‌తిరేక‌త దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ పుంజుకోకుండా చేసే వ్యూహంలో భాగంగానే.. మోడీ క‌నుస‌న్న‌ల్లోనే కాంగ్రెస్‌కు వ్యూహ‌క‌ర్త‌గా మారుతున్నార‌నేది వీరి వాద‌న‌. ప్ర‌శాంత్ కిశోర్‌.. కాంగ్రెస్‌లోకి వ‌చ్చినా.. ఆయ‌న‌ను న‌మ్ముకుంటే.. క‌ష్ట‌మ‌ని.. ఆయ‌న వ్యూహాల‌తో కాంగ్రెస్ పుంజుకోక‌పోగా.. మోడీపై వ్య‌తిరేక‌త‌ను కూడా గెయిన్ చేసుకునే అవ‌కాశం ఉండ‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో రాహుల్‌కు చిత్ర‌మైన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దేశంలో మోడీ వ్య‌తిరేక‌త ఉన్న నేప‌థ్యంలో ఆయ‌న శిష్యుడుగా తెర‌మీదికి వ‌చ్చిన ప్ర‌శాంత్ కిశోర్‌.. కాంగ్రెస్‌లోకి వ‌చ్చినా.. ఆయ‌న అనుంగుగానే ప‌నిచేస్తార‌ని.. అంటున్నారు. ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లోనూ మ‌మ‌త‌ను ఓడించాల‌న్న బీజేపీ వ్యూహాన్ని లోపాయికారీగా ప్ర‌శాంత్ అమ‌లు చేశార‌ని.. నందిగ్రామ్ నియోజ‌క‌వ‌ర్గంలో ఆమె ఓడిపోవ‌డం.. బీజేపీ నాయ‌కుడు సుబేందు అధికారి విజ‌యం ద‌క్కించుకోవ‌డం వెనుక ఇదే రీజ‌న్ ఉంద‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీ త‌న వ్య‌తిరేక‌త నుంచి బ‌య‌ట ప‌డేందుకు, అదేస‌మ‌యంలో కాంగ్రెస్ పుంజుకోకుండా చేసేందుకు ప్ర‌శాంత్ కిశోర్‌ను ఆయ‌నే కాంగ్రెస్‌లోకి పంపుతున్నార‌నే వాద‌న‌ను కాంగ్రెస్ సీనియ‌ర్లు చెబుతున్నారు. మ‌రి రాహుల్ ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News