ఏం లాజిక్‌ బాస్ః సీఎం 2 ల‌క్ష‌ల అద్దె చెల్లించొద్దా?

Update: 2016-05-27 07:09 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు హైద‌రాబాద్‌ నివాసం వ్య‌వ‌హారం రోజురోజుకు ఆస‌క్తిక‌రంగా మారుతోంది. హైద‌రాబాద్‌లో ప్ర‌స్తుతం ఉంటున్న అద్దె నివాసం నుంచి ఫైవ్ స్టార్ హోటల్ అయిన ఫార్క్ హ‌యత్‌ లోకి చంద్ర‌బాబు మారుతున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ హోట‌ల్లో చంద్ర‌బాబు కుటుంబం ఉండ‌టం వ‌ల్ల‌ రోజువారి అద్దె రూ.2ల‌క్ష‌లు చెల్లించాల్సి వ‌స్తోంద‌ని, అది రాష్ట్ర ఖ‌జానాపై పెను భారం అని గ‌గ్గోలు పుట్టింది. దీనిపై వివాదం చెల‌రేగుతుండ‌గా ఇపుడు ఏపీ మంత్రులు చేసిన కామెంట్లు వాటికి మ‌రింత ఆజ్యం పోసినట్ల‌యింది.

ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు - కార్మిక శాఖ అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యంపై ఇచ్చిన క్లారిటీలో భాగంగా మ‌రింత క‌ల‌క‌లం రేగే కామెంట్లు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్ర‌బాబు రూ.2 లక్షల ఇంటి అద్దె చెల్లించకూడదా అని మంత్రులు ప్రశ్నించారు. ప్రతిపక్షాలు - మీడియా దీనిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. చంద్ర‌బాబు తొమ్మిదేళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నారని, మూడోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్నారని అలాంటి చంద్రబాబు రూ.2లక్షలు చెల్లిస్తే తప్పేంటని మంత్రులు ప్రశ్నించారు. రోజూ లక్షలు చెల్లించి ఎంతోమంది స్టార్‌ హోటళ్లల్లో ఉంటున్నారని, అలాంటప్పుడు ముఖ్యమంత్రి ఉండకూడదా అని వారు నిల‌దీశారు. మొన్నటి వరకు ఆయన 500 గజాల ఇంటిలోనే ఉండేవారని, అది సరిపోవడం లేదనే మారుతున్న‌ట్లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌ పై మంత్రులు మండిప‌డ్డారు. ప్రభుత్వం ఆస్తులు అటాచ్‌ చేసిన పత్రికలో ఇష్టం వచ్చిన్నట్లు ప్రతిపక్షనేత వార్తలు రాయిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదని విమ‌ర్శించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విజ‌య‌సాయిరెడ్డి రాజ్యసభకు ఎంపిక చేసి ప్రజాస్వామ్యాన్ని జ‌గ‌న్ ఖూనీ చేశారని విమర్శించారు. జగన్‌ కు లాభం చేకూర్చినందుకే విజయసాయిరెడ్డిని ఎంపిక చేశారని ఆరోపించారు. వైసీపీలో నేరస్థులకే స్థానం ఉందని గ్రహించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వస్తున్నారన్నారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి కూడా ఆర్థిక ఆరోపణాలు ఎదుర్కొంటున్నారని మీడియా ప్రశ్నించగా, సుజనా విషయాన్ని పార్టీలో చర్చిస్తామని మంత్రులు దాట‌వేశారు.
Tags:    

Similar News