రుణ మాఫీపై చర్చకు రావాలట

Update: 2015-09-10 09:46 GMT
రుణ మాఫీపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్ కు వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు సవాల్ విసిరారు. అయితే, రుణ మాఫీ చర్చలో అధికార పార్టీ ఎలా గెలుస్తుంది? పట్టిసీమ, గోదావరి జలాల తరహాలో ఎదురు దాడి చేస్తున్నట్లే రుణమాఫీ విషయంలోనూ ఎదురు దాడి చేసి గెలుస్తుందా? రూ.80 వేల కోట్ల రుణాలను నాలుగో వంతుకు పరిమితం చేసి.. రకరకాల మినహాయింపు ద్వారా నాలుగేళ్లలో కేవలం రూ.19 వేల కోట్లను మాత్రమే రుణ మాఫీ చేస్తూ తాము అద్భుతంగా అమలు చేశామని ఎలా చెబుతారు?

మహిళల బంగారు రుణాలు సహా అన్ని రుణాలనూ మాఫీ చేసి పారేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ఆ పార్టీ నాయకులంతా ఇదే అంశంపై ఇంటింటికీ కరపత్రాలు పంచారు. బాబు వస్తే రుణం పోతుందని ఆశ పెట్టారు. రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో రూ.80 వేల కోట్ల రుణాలు ఉన్నాయని ప్రతిపక్షం చెప్పినా వినిపించుకోకుండా తాను ఆర్థికవేత్తనని, రుణ మాఫీ ఎలా చేస్తానో చూడాలని చంద్రబాబు సవాల్ విసిరారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత రుణ మాపీని ఎలా అమలు చేశారు.

రుణ మాఫీ అమలుకు రకరకాల అడ్డంకులు పెట్టారు. కుటుంబానికి లక్షన్నర పరిమితం చేశారు. అరటి వంటి పంటలను తొలగించారు. వాణిజ్య పంటలను తీసేశారు. ఆధార్, రేషన్ కార్డంటూ రకరకాల ఆంక్షలు పెట్టారు. చివరికి, మూడు విడతల్లో రూ.80 వేల కోట్ల రుణాలను కాస్తా రూ.19 వేల కోట్లకు పరిమితం చేశారు. అంటే నాలుగో వంతుకు మాత్రమే రుణ మాఫీ అందింది. ఎన్నికల ముందు తమకు రుణ మాఫీ వస్తుందని ఆశ పెట్టుకుని, టీడీపీకి ఓటు వేసిన మూడో వంతు ప్రజలు ఇంకా నిరాశలోనే ఉన్నారు. అయినా, మంత్రి పుల్లారావు రుణ మాఫీపై చర్చకు రమ్మంటున్నారు. అయితే, రుణ మాఫీపై ఇక నుంచి అయినా అధికార పార్టీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని, ఇటువంటి సవాళ్లు ఎదురు దెబ్బ తీసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News