ముందస్తు పొత్తులు...వైసీపీకి షాక్!

Update: 2022-10-18 12:30 GMT
పొత్తులు ఎపుడూ ఎన్నికల ముందు కుదురుతాయి. ముందుగా వాటి గురించి ఎవరూ చర్చించరు. కానీ ఏపీలో మాత్రం వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విపక్ష పార్టీల పొత్తుల మీదనే రాజకీయం సాగుతూ వస్తోంది. పవన్ కళ్యాణ్ జనసేన, చంద్రబాబు టీడీపీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాయని ఎన్నో సార్లు వైసీపీ చెబుతూ వస్తోంది. అందుకే పవన్ని దత్తపుత్రుడు అని కామెంట్స్ చేస్తూ వచ్చింది.

అయినా సరే అటూ ఇటూ కూడా ఎవరూ తొందరపడలేదు. ఎవరి రాజకీయం వారు చేసుకుంటూ వచ్చారు. కానీ సడెన్ గా విశాఖ ఎయిర్ పోర్టు సంఘటన, జనసైనికులను అరెస్ట్ చేయడం, పవన్ విశాఖలో  హొటల్ గదికే పరిమితం అయిపోవడం వంటివి ఆ పార్టీకి షాకింగ్ కాగా, అదే టైంలో అలా ఏర్పడిన రాజకీయాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని పరామర్శ పేరుతో టీడీపీ పావులు వేగంగా కలిపింది.

ఇపుడు పవన్ని విజయవాడ హొటల్ లో చంద్రబాబు పరామర్శించడం అన్నది జస్ట్ లాంచనమే అని అంటున్నారు. పొత్తుల విషయంలో పడుతున్న తొలి అడుగుగా దీన్ని చూస్తున్నారు. అంతే కాదు పొత్తుల విషయంలో ఈ రెండు పార్టీలు చాలా ముందస్తుగానే కార్యాచరణకు సిద్ధం అవుతున్నాయని అన్న సంకేతాలు కూడా ఇస్తున్నాయి.

నిజానికి ఈ ముందస్తు పొత్తులు అన్నవి ఆయా పార్టీలకు మరింత జోష్ తో పాటు విజయావకాశాలను పెంచుతాయని అంటున్నారు. ఎలాగంటే పొత్తుల రూపేణా ఎన్నో కొన్ని సీట్లు జనసేనకు ఎన్నికల వేళ సర్దుబాటు చేస్తే అపుడు టీడీపీలో అసంతృప్తి కలుగుతుంది. అదే సమయంలో పొత్తులు కూడా సరిగ్గా వర్కౌట్ అయ్యే సీన్ ఉండదు. అలాగే ఇటు జనసేనలో కూడా చాలా చోట్ల పార్టీ నాయకులు తాము పోటీ చేయాలని ఉబలాటపడతారు. తీరా పొత్తులు కుదిరితే వారికి ఇబ్బంది ఏర్పడుతుంది.

దాంతో ఎన్నికల ముందు దాకా ఈ రకమైన సందిగ్ద పరిస్థితి ఉండకుండా పొత్తులు ముందే కుదిరితే నచ్చిన వారు పార్టీలో ఉంటారు. లేని వారు ఉండరు. ఇక ఉమ్మడిగా కార్యాచరణ ప్రకటించుకుని ఎన్నికలలో గెలుపు కోసం పోరాడితే కచ్చితంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.

ఇలా ముందస్తు పొత్తుల వల్ల ఏపీలో విపక్ష బలం బాగా పెరుగుతుంది. అదే సమయంలో జనాలకు కూడా ఆల్టర్నేషన్ మీద నమ్మకం ఏర్పడుతుంది. ఒక విధంగా ముందస్తు పొత్తుల వల్ల వైసీపీకి రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. మరి దీని మీద వైసీపీ పై ఎత్తులు ఎలా ఉంటాయో అన్నది చూడాలని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News