ఆ రాజ‌కీయ నాయకుడిని కూడా ఎన్‌ కౌంట‌ర్ చేయండి..మ‌రో త‌ల్లి ఆవేద‌న‌

Update: 2019-12-06 16:29 GMT
హైద‌రాబాద్‌ కు చెందిన వెట‌ర్న‌రీ డాక్ట‌ర్ దిశను అత్యంత దారుణంగా అత్యాచారం చేసి హత్యచేసిన సంఘ‌ట‌న గ‌త వారం రోజులుగా దేశ‌వ్యాప్తంగా ప్ర‌తి ఒక్కరిని తీవ్రంగా క‌లిచి వేసింది. నిందితుల‌ను ఉరి తీయాల‌ని... వాళ్ల‌కు ర‌క‌ర‌కాల శిక్ష‌లు వేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రు తీవ్రంగా స్పందించారు. ఎట్ట‌కేల‌కు ఈ రోజు తెల్ల‌వారు ఝామున దిశపై హ‌త్యాచారం చేసిన న‌లుగురు నిందితుల‌ను ఆమెను ఎక్క‌డైతే చంపారో అక్క‌డే ఎన్‌ కౌంట‌ర్ చేసి చంపేశారు. ఈ సంఘ‌ట‌న‌పై యావ‌త్ దేశ‌వ్యాప్తంగా ప్ర‌శంస‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ప్ర‌తి ఒక్క‌రు తెలంగాణ పోలీసుల‌తో పాటు సీపీ స‌జ్జ‌నార్‌ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. దిశకు వెంట‌నే త‌గిన న్యాయం జ‌రిగిందంటున్నారు. అయితే ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది కామాంధుల చేతుల్లో బ‌లైపోయిన ఆడ‌పిల్ల‌ల త‌ల్లిదండ్రులు - బంధువులు సైతం ఇదే త‌ర‌హా న్యాయం త‌మ‌కు కూడా జ‌ర‌గాల‌ని సోష‌ల్ మీడియా లోనూ - మీడియాలోనూ కోరుతున్నారు. ఈ సంఘ‌ట‌న జ‌రిగిన వెంట‌నే అయేషా మీరా (విజ‌య‌వాడ‌లో వైఎస్ సీఎంగా ఉన్న‌ప్పుడు హ‌త్య‌కు గురైన న‌ర్సింగ్ విద్యార్థిని) త‌ల్లి స్పందిస్తూ ఇలాంటి సంఘ‌ట‌న‌ల్లో సామాన్యుల‌ను ఎన్‌ కౌంట‌ర్ చేయ‌డం కాదు.. బ‌డా రాజ‌కీయ నాయ‌కులు ఉన్నా వారిని కూడా ఎన్‌ కౌంట‌ర్ చేయాల‌ని కోరింది.

స‌జ్జ‌నార్ లాంటి వ్య‌క్తి త‌మ కుమార్తె కేసు విచార‌ణ చేసి ఉంటే త‌మ‌కు కూడా న్యాయం జ‌రిగేద‌ని తెలిపింది. అప్ప‌ట్లో ఆమె కుమార్తె హత్యాచారం కేసులో అప్ప‌టి మంత్రి మ‌న‌వ‌డిపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇక తాజాగా ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో యూపీలోని లోక్నోకు చెందిన ఓ బాధితురాలి త‌ల్లి త‌న బిడ్డ‌కు న్యాయం చేయాలంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. దిశ నిందితుల‌ను ఎన్‌ కౌంట‌ర్ చేయ‌డంపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తూనే త‌న కుమార్తెకు జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌స్తావించింది.

త‌న కుమార్తెను ఓ ప్ర‌ముఖ రాజ‌కీయ నేత అత్యాచారం చేసి దారుణంగా చంపేశాడ‌ని ఆమె తెలిపింది. అయితే పోలీసులు రాజ‌కీయ ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి ఈ కేసును యాక్సిడెంట్ కేసుగా మార్చేశార‌ని ఆమె వాపోయింది. త‌న కుమార్తె బ‌లైపోయింద‌ని.. ఆ రాజ‌కీయ నేత మాత్రం త‌మ క‌ళ్ల‌ముందే స్వేచ్ఛ‌గా తిరుగుతున్నాడ‌ని పేర్కొంది. యూపీ పోలీసులు కూడా త‌న కుమార్తెను చంపిన నిందితుడిపై చ‌ర్య‌లు తీసుకుంటేనే ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరుతుంద‌ని.. అత‌డిని కూడా ఎన్‌ కౌంట‌ర్ చేయాల‌ని.. ఇందుకు ప్ర‌జ‌లు త‌న‌కు మ‌ద్ద‌తు తెల‌పాల‌ని ఆమె ట్వీట్ట‌ర్‌ లో కోరింది.
Tags:    

Similar News