టెక్కలి నుంచి పురంధేశ్వరి పోటీ?

Update: 2018-04-12 14:31 GMT
కేంద్ర మాజీ మంత్రి - బీజేపీ నేత పురంధేశ్వరి 2019 ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీచేయనున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆమె నియోజకవర్గాన్ని సైతం ఎంపిక చేసుకున్నట్లు వినిపిస్తోంది. సొంత జిల్లాలను కాదని ఏకంగా శ్రీకాకుళం జిల్లా నుంచి ఆమె అసెంబ్లీ బరిలో దిగేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు తన తండ్రిని ఆదరించిన టెక్కలి నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేయాలని ఆమె భావిస్తున్నారని బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తోంది.
    
టెక్కలి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రస్తుతం మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి మంత్రి పదవి చేపట్టిన ఆయన తన నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టారు. పైగా కింజరాపు కుటుంబానికి పట్టున్న ప్రాంతం కావడంతో అక్కడ పురంధేశ్వరి నెగ్గుకు రావడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.
    
అయితే... బీజేపీకి ఎదురుగాలి వీస్తున్న ప్రస్తుత తరుణంలో సెంట్రల్ ఆంధ్ర జిల్లాల్లో బలంగా ఉన్న టీడీపీ.. రాయలసీమలో బలమైన వైసీపీని తట్టుకోవడం కష్టమన్న ఉద్దేశంతో ఆమె ఎన్టీఆర్ సెంటిమెంటుపై ఆశతో టెక్కలిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అయితే, శ్రీకాకుళంలో జిల్లాలో అంతంతమాత్రంగానే బీజేపీ ఉండడం.. టీడీపీ అక్కడ బలంగా ఉన్న నేపథ్యంలో పురంధేశ్వరి ఎలాంటి వ్యూహంతో ఆ సీటును ఎంచుకున్నారన్నది అర్థం కాలేదని స్థానిక నేతలు అంటున్నారు. మొత్తానికైతే కొద్దిరోజులుగా ఆ ప్రాంతంలో పురంధేశ్వరి పోటీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Tags:    

Similar News