అధికారలోలుడు...యుద్ధోన్మాది... ప్రపంచానికే పెను సవాల్...?

Update: 2022-02-26 07:30 GMT
తెగించిన వారికి ఎదురే లేదని అంటారు. ఈ రోజు రష్యా అధ్యక్షుడు పుతిన్ అలాగే కనిపిస్తున్నారు. ఆయనది అధికార దాహం. యుద్ధ వ్యామోహం. ఎలాగైనా తన మాటే చెల్లాలన్న దారుణమైన మనస్తత్వం. తమ దేశ ప్రజల అభిప్రాయాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా తొక్కిపెట్టి ఉంచిన పుతిన్ ఇపుడు ప్రపంచాన్ని కూడా అదే కఠినమైన స్వభావంతో బెదిరిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు.

తన మాట విననివారు ఎంతటివారు అయినా బ్లాక్ మెయిల్ చేయడం, వారు ఆయువు పట్టు మీద అదను చూసి కొట్టడం ఈ డెబ్బై ఏళ్ల యుద్ధ పిపాసికి అలవాటు. తన పర భేదం లేదు, అధికారం కోసం ఎంతకైనా తెగించేయాల్సిందే. ఈ విషయంలో తేడా పాడా వచ్చినా లెక్కే లేదు. లేకపోతే ప్రపంచాన్ని బెదిరించే వారిని ఈ ఆధునిక యుగంలో ఎవరైనా చూశారా.

అంతర్జాతీయ సమాజ నియమాలను అన్నింటికీ ఉల్లఘించి తాను ఏమైనా చేస్తాను, మీరు మాత్రం నోరు విప్పకూడదు అన్న నియంత తత్వం ఎక్కడ నుంచి వచ్చింది పుతిన్ కి అన్న డౌట్లు వస్తాయి. ఆయన 2008లో తొలిసారి రష్యా ప్రెసిడెంట్ అయినప్పటి నుంచే ఇలాంటి వాతావరణాన్ని తీసుకురావాలని, ప్రపంచాన్ని హడలెత్తించాలని ఆలోచనతో ఉన్నారని అర్ధమవుతోంది.

సరైన సమయం చూసుకుని ఆయన ఇలా బరితెగించారు అని అంటున్నారు. ఈ రోజు అమెరికాకే పుతిన్ సవాల్ విసురుతున్నారు, ఇంత మారణహోమం జరుగుతున్నా ప్రపంచం మొత్తం స్పదన మాత్రం అతి పేలవంగా ఉంది అంటే అది పుతిన్ సాధించిన భయంకరమైన విజయం అని చెప్పాల్సి ఉంటుంది. తాను ఎవరినీ లెక్క చేయను అంటూ దూకుడు మీద ఉన్న ఈ నయా నియంత ప్రపంచాన్నే హెచ్చరించే స్థాయికి వెళ్ళిపోతున్నాడు.

తమ దేశం జోలికి వస్తే ఖబడ్దార్ అంటున్నారు. ఒక విధంగా పుతిన్ వైఖరితో తొలి షాక్ తిన్నది అమెరికాయే అని అనుకోవాల్సివస్తోంది. ఎంతటి అమెరికా ఈ రోజు అలా అయిపోయింది అన్న చర్చ వస్తోంది. ఉక్రెయిన్ కి కించిత్తు సాయం చేయకుండా ఉండిపోవాల్సివచ్చినంటే పుతిన్ బెదిరింపులు కచ్చితంగా పనిచేసినట్లే అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే పుతిన్ లో అనవసరంగా ప్రపంచంలో అశాంతిని తెచ్చానూ అన్న పశ్చాత్తాపం ఎక్కదా కనిపించడంలేదు అంటున్నారు.

ఉక్రెయిన్ ని చూపించి ఇపుడు రెండు దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇవ్వడం ఎలా చూడాలి. తాము చెప్పినట్టు వినాల్సిందే, లేదంటే ఉక్రెయిన్‌ గతే పడుతుందంటూ స్వీడెన్‌ తో పాటు  ఫిన్‌లాండ్‌కు వార్నింగ్‌ ఇచ్చారు పుతిన్‌. నాటో కూటమిలో చేరే ప్రయత్నం చేయొద్దంటూ డైరెక్ట్‌గా హెచ్చరికలు జారీ చేశారు.

మరి దీన్ని బట్టి పుతిన్ మారలేదని అర్ధమవుతోంది. అదే టైమ్ లో ప్రపంచం తాలూకా భయాన్ని ఆయన సొమ్ము చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఉక్రెయిన్ మీద ఇలా దారుణంగా దండయాత్ర చేస్తున్న ప్రపంచం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం కూడా ఆయనకు కొత్త బలాన్ని ఇచ్చి ఉండవచ్చు.

అందుకే రెట్టించిన ఉత్సాహంతో ఇపుడు ఆయన మరిన్ని దేశాలతో యుద్ధం అని ప్రకటించగలుగుతున్నారు. మరో వైపు చూస్తే వ్లాదిమిర్‌ పుతిన్‌ కి సొంత గడ్డ మీద తిరుగులేదు. ఆయనే రష్యాకు ఏకఛత్రాధిపతి. ఆయన్ని అక్కడ ఢీ కొట్టే వారు ఎవరూ లేరు. 2036 వరకు పుతిన్‌కు ఎదురే లేదు, అంటే ఇంకో పద్నాలుగేళ్లు పుతినే రష్యా ప్రెసిడెంట్‌. పదవీకాంక్షతో ఏకంగా దేశ రాజ్యాంగాన్నే మార్చేసిన అధికారలోలుడు పుతిన్‌ ఇపుడు ప్రపంచాన్ని గుప్పిట పట్టడానికి బయల్దేరాడు అని అంటున్నారు. మరి పుతిన్ దూకుడు చూస్తే ఆయన ఏమైనా చేస్తారా అన్న చర్చ అయితే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News