ఆకాశయానం అంటేనే... భయస్తులకు చెమటలు పడతాయి. ఇటీవలి కాలంలో అయితే ఈ తరహా భయాలు కాస్తంత తగ్గాయేమో గానీ... గతంలో అయితే విమానయానం అంటేనే జడిసిపోయేవారు. అందులోనూ ఖర్చు కూడా కాస్త అధికంగానే ఉండటంతో సంపన్న వర్గాలకు మాత్రమే అది పరిమితమై పోయిందన్న వాదన లేకపోలేదు. ఆకాశయానంలో ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే... సదరు విమానంలో ఉన్న ప్రయాణికుల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు. ఈ విషయం ఇప్పటిదాకా జరిగిన ప్రమాదాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమైపోతుంది. అంటే చిన్న తప్పిదం జరిగినా... వందల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయమేనన్నమాట.
మరి వందల మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని గాల్లోకి ఎగురుతున్న విమానాలను నడిపే పైలెట్లు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా వారితో పాటు ప్రయాణికుల ప్రాణాలు హరీమనడం ఖాయమే. అందుకే పైలట్ గా విధులు నిర్వర్తించే వారిపై నిత్యం నిఘా ఉంటుంది. ఏమాత్రం అనుమానం వచ్చినా సదరు పైలట్ విమానం ఎక్కేందుకు విమానయాన సంస్థలు ససేమిరా అంటున్న వైనం కూడా మనకు తెలిసిందే. అంతా బాగానే ఉండి... ఆకాశంలోకి వెళ్లిన తర్వాత సదరు పైలట్ కు అనుకోని అనారోగ్యం తలెత్తితే... ఇంకేముంది... అతడితో పాటు ప్రయాణికుల ప్రాణాలు కూడా గాల్లో ఉన్నట్లే లెక్క. ఇలాంటి ఘటనే నేటి ఉదయం జరిగింది. అటు విమానంలోని ప్రయాణికులతో పాటు వారి బంధువర్గాన్ని కూడా ఈ ప్రమాదం బెంబేలెత్తించిందనే చెప్పాలి.
ఆ ప్రమాదం వివరాల్లోకెళితే... దోహా నుంచి రోమన్ వెళ్తున్న ఖతార్ ఎయిర్ లైన్స్ విమానం గాల్లో ఉండగా పైలట్ కు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన సదరు పైలట్ ఈ విషయాన్ని అందులోని 225 మంది ప్రయాణికులకు తెలిపి.. అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్ పోర్టు అధికారులను సంప్రదించాడు. వారు తక్షణం అనుమతి ఇవ్వడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశాడు. దీంతో విమానంలోని ప్రయాణికులు బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం పైలట్ ను ఆసుపత్రికి తరలించారు.