ఆర్‌.కృష్ణ‌య్య ... నీ స్వ‌రూపం తెలిసింద‌య్యా!

Update: 2018-11-19 06:12 GMT
ఆర్. క్రిష్ణయ్య. బిసీ కులాలకు పెద్ద దిక్కు. గడచిన నాలుగు దశాబ్దాలుగా బీసీ కులాల అభివృద్ది కోసం పాటుపడుతున్న నాయకుడు! బీసీల సంక్షేమమే తమ సంక్షేమంగా పని చేసిన నాయకుడు. విద్యార్దిగా ఉన్నప్పటి నుంచి నేటి వరకు బీసీల పురోగతే పరమావధిగా పనిచేసిన వారు. అనేక యుద్దములలో ఆరితేరిన వారు. ఒక్క పిలుపుతో తెలుగు రాష్ట్రాల జనజీవనాన్ని స్తంభింపచేసే సత్తా ఉన్న నాయకుడు. ఇవన్నీ గతం.   ప్రస్తుతం ఆ ఆర్.క్రిష్ణయ్య ఇప్పుడు లేరు. ఆర్‌ అంతే రాజకీయమని తన ఇంటి పేరును మార్చుకున్న నాయకుడు అని బీసీ సంఘాల వారు విమర్శిస్తున్నారు. గడచిన కొంత కాలంగా తెలుగు రాజకీయాలలో బీసీ కులాలకు ప్రాధాన్యం దక్కడం లేదని రాజకీయాలలో తమను వాడుకుంటున్నారే తప్ప పట్టించుకోవడం లేదని క్రిష్ణయ్య మండిపడుతున్నారు. తమ బతుకులు తామే బాగుచేసుకోవాలంటే బీసీలకు ఓ రాజకీయ పార్టీ అవసరమని ప్రకటించారు. వారికి సమాజంలో అట్టడుగున ఉన్న ఇతర కులాల వారికి ఒకటే సమస్యలు కాబట్టి రాజకీయ పార్టీ పెట్టి వారితో కలసి నడవాలని నిర్ణయించారు. ఈ మేరకు మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చారు. అయితే ఒక్క రాత్రిలో అదంతా మారిపోయింది. కేవలం ఒక్క సమావేశంతోనే ఆయన కాంగ్రెస్ నాయకుడయ్యారు. ఆ పార్టీలో అలా చేరి ఇలా టిక్కట్టు సంపాదించుకున్నారు.

నాలుగు దశాబ్దాల పాటు బీసీ కులాల నాయకుడిగా ఉన్న  ఆర్‌. క్రిష్ణయ్య గత ఎన్నికలలో రాజకీయ తీర్దం పుచ్చుకున్నారు. హైదారబాద్‌ లోని ఎల్బీన‌గ‌ర్‌ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్దిగా పోటి చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది కారెక్కేసారు. అయితే ఆర్. క్రిష్ణయ్య మాత్రం నిబద్దత‌తో తెలుగుదేశం లోనే ఉండిపోయారు. ఇది చూసిన వారంత ఆహా క్రిష్ణయ్య అంటూ ప్రసంసించారు. గత కొంత కాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉన్న క్రిష్ణయ్య సీపీ‍ఎంతో చేతులు కలిపారు. ఆ పార్టీ కూటమి నుంచి తెలంగాణ ముందస్తు ఎన్నికలలో ఎక్కువ మంది బీసీలకు టిక్కెట్లు వచ్చేల చేసారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. ఆదివారం నాడే పరిస్ధితి మారిపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకులను కలసిన ఆర్. క్రిష్ణయ్య రాత్రికి రాత్రి ఆ పార్టీలో చేరి మిర్యాలగూడ నుంచి టిక్కెట్టు సాధించారు. ఇది వ్యక్తిగతంగా క్రిష్ణయ్యకు అనుకూలిస్తుందేమో గాని ఆయనను నమ్ముకున్న బీసీలు మాత్రం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్లు నిబద్దత‌తో ఉన్న  నాయకుడు హఠాత్తుగా స్వార్థం కోసం కాంగ్రెస్‌ లో చేరడాన్ని జీర్ణం చేసుకోలేక పోతున్నారు.


Tags:    

Similar News