ఏపీలో అభీష్ట క‌ల‌క‌లం!

Update: 2015-10-29 10:00 GMT
కొన్ని పేర్లు చాలా త‌క్కువ మందికే తెలుస్తాయి. పేరు బ‌య‌ట‌కు రానంత మాత్రాన వారి ప‌వ‌ర్ ఏమీ త‌గ్గిపోదు. నిజానికి ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేని వారు ఎంత శ‌క్తివంతుల‌న్న‌ది ప్ర‌భుత్వంతో నేరుగా సంబంధాలు ఉన్న వారికి త‌ర‌చూ అవ‌గ‌త‌మ‌వుతూనే ఉంది. అభీష్ట అన్న పేరు కూడా అలాంటి కోవ‌కు చెందిందే. ఈ పేరు విన్న వెంట‌నే నొస‌లు చిట్లించి.. ఎవ‌ర‌ని అడిగే వారు చాలామందే ఉంటారు. అయితే.. రాజ‌కీయ వ‌ర్గాల్లోనూ.. మీడియా స‌ర్కిల్స్ లోనూ ఈ పేరు చాలా పాపుల‌ర్‌.

అప్ప‌ట్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కుమారుడు లోకేశ్ నేతృత్వంలో (?) ఒక ఛాన‌ల్ న‌డిచేది. దీనికి సంబంధించిన వ్య‌వ‌హారాల‌న్నీ అభీష్ట చూసుకునేవారు. ఇంత‌కీ ఎవ‌రీ అభీష్ట‌.?లోకేశ్ కు ఆయ‌న‌కు మ‌ధ్య సంబంధం ఏమిటి?  ప్ర‌శ్న‌ల‌కు సింఫుల్‌ గా స‌మాధానం చెప్పాలంటే.. లోకేశ్‌ కు అభీష్ట చాలా చాలా ద‌గ్గ‌రి స్నేహితుడు. అంత‌కు మించి జానే జిగిరి దోస్త్ అంటే స‌రిపోతుందేమో. లోకేశ్ కు సంబంధించిన కీల‌క అంశాల విష‌యంలో అభీష్ట ముద్ర ఉండాల్సిందే. ఆయ‌న లేకుండా లోకేశ్ చాలా నిర్ణ‌యాలు తీసుకోర‌ని చెబుతారు.

అలాంటి అభీష్ట తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఓఎస్‌ డీగా నియ‌మించ‌టం రాజ‌కీయ క‌ల‌క‌లానికి తావిస్తోంది. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కార్యాల‌యంలో రాజ్యాంగేత‌ర శ‌క్తులు ప‌ని చేస్తున్నాయంటూ ఏపీ పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా ఆరోపించారు. అభీష్ట‌ను ఏ ర‌కంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓఎస్ డీగా అపాయింట్ చేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

చంద్ర‌బాబు పాల‌న‌తో కిందిస్థాయి నుంచి సీఎంవో వ‌ర‌కు ఆరాచ‌క పాల‌న సాగుతుంద‌ని మండిప‌డ్డ ర‌ఘువీరా.. ఏ అర్హ‌త‌తో అభీష్ట‌ను ఓఎస్డీగా నియ‌మించార‌ని ప్ర‌శ్నించారు.ముఖ్య‌మైన ఫైళ్లు అన్నీ కూడా లోకేశ్ మాట‌తో అభీష్ట ద్వారానే సాగుతున్నాయ‌ని విమ‌ర్శించారు. ర‌ఘువీరా అమాయ‌క‌త్వం కాకుంటే.. ముఖ్య‌మంత్రి కుమారుడు లోకేశ్ కు బెస్ట్ ఫ్రెండ్ అన్న ఒక్క కార‌ణం చాల‌దా?

అయినా.. వైఎస్ హ‌యాంలో కేవీపీ రామ‌చంద్ర‌రావును ఏ అర్హ‌త‌తో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా నియ‌మించారన్న మాట‌ను ప్ర‌శ్నించే సాహ‌సం చేయ‌లేకపోయిన ర‌ఘువీరా చంద్ర‌బాబు తీసుకున్న నిర్ణ‌యాన్ని ఎందుకు త‌ప్పు ప‌డుతున్నారు? ఎవ‌రికి వారు వారి వారి స‌న్నిహితుల‌కు తాము అధికారంలో ఉన్న‌ప్పుడు అత్యున్న‌త స్థానాలు క‌ట్ట‌బెట్ట‌టం మామూలేమో. కాక‌పోతే.. బాబు అధికారంలో ఉన్న‌ప్పుడు ర‌ఘువీరా మండిప‌డితే.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు చంద్ర‌బాబు మండిప‌డ‌తారంతే. జ‌రిగేవి జ‌రుగుతూనే ఉంటాయి.
Tags:    

Similar News