రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ఒకేసారి విదేశీ పర్యటకు వెళ్తున్నారు... అది కూడా ఒకే దేశానికి... ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు గురువారం నుంచి ఆరు రోజుల అమెరికా పర్యటనకు వెళ్తుండగా... అదేసమయంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా అమెరికా విమానమెక్కుతున్నారు. అన్ని పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారిన బీహార్ ఎన్నికలకు ముందు ఇలా ఇద్దరు నేతలూ దేశంలో ఉండడం లేదు.
కాగా ప్రధాని మోడీ పర్యటన షెడ్యూల్ మొత్తం దేశానికి తెలిసినా రాహుల్ పర్యటన వివరాలు మాత్రం రహస్యంగానే ఉంచారు. రకరకాల కథలు ప్రచారంలోకి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ తన అధికార ప్రతినిధులతో ప్రకటన చేయించింది... కొలరాడోలో జరగనున్న సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ అమెరికా వెళ్లారని... ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని నేతలు పాల్గొంటున్న సమావేశాలకు వెళ్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిది సూర్జేవాలా చెప్పారు. రాహుల్ అక్కడ ఎన్నిరోజులుంటారు... అవి ఏ సమావేశాలన్నది మాత్రం వెల్లడించలేదు. అంతేకాదు... కొద్ది గంటల్లోనే ఆయన ఇంకో వెర్షన్ తో మీడియా ముందుకొచ్చారు. రాహుల్ గాంధీ వ్యక్తిగత పనిపై విదేశాలకు వెళ్లారని, త్వరలో తిరిగి వచ్చి బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయనే చెప్పడం గమనార్హం.
మొత్తానికి రాహుల్ పర్యటనను కాంగ్రెస్ రహస్యంగా ఉంచుతోందని మాత్రం అర్థమవుతోంది. బీహారు ఎన్నికలలో ఒకటి,రెండు సభలలో పాల్గొని ఆయన ఆకస్మికంగా అమెరికా వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. కిందటిసారి ఆయన 55 రోజులు రహస్య పర్యటన చేయగా.. ఈసారి ఎన్నాళ్లో అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు.