యువరాజు నెత్తిన కిరీటం: ఏంతేడా వస్తుంది?

Update: 2017-11-21 04:08 GMT
కిరీటం ఉండడానికి లేకపోవడానికి మధ్య ఏమైనా తేడా ఉంటుందా? కిరీటం లేకపోయినంత మాత్రాన యువరాజు ఇప్పుడు సామాన్య పౌరుడిలాగా.. సారీ, సామాన్య కార్యకర్తలాగా బతుకుతూ ఉన్నాడా? పార్టీలో ఎలాంటి మకుటం లేని మహారాజు అధికారాలను వెలగబెట్టడం లేదా? మరైతే ఏదో ప్రత్యేకించి.. కిరీటధారణ మహోత్సవం గురించి.. అక్కడికేదో పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో సమూలమైన మార్పులు జరిగిపోతున్నట్లుగా.. అందరూ అంత లావు ప్రచారం చేస్తున్నారెందుకు? అనే సందేహాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు విశ్లేషకుల్లో కలుగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీకి రాహుల్ తప్ప మరో గత్యంతరం లేదు అనే సంగతి అందరూ ఎరిగినదే. ప్రకటించినా లేకున్నా ఆయనే ఆ పార్టీకి అధ్యక్షుడు.. లాంటివాడు అని అందరికీ తెలుసు. కాకపోతే.. ఆయన హోదా ప్రకటన ఒక లాంఛనం. అమ్మచేతిలో ఉండే అధికార దండాన్ని.. ఇన్నాళ్లూ నడిపిస్తున్నది తానే అయినా.. ఇప్పుడు అధికారికంగా పుచ్చుకుంటారన్నమాట. ఇప్పటివరకు  కూడా.. అందరూ ఆయనను తమ సర్వాధినేతగానే చూస్తున్నారు... కీర్తిస్తున్నారు. కాకపోతే.. ఇప్పుడు కిరీటధారణకు ముహూర్తం పెడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాగత ఎన్నికలకు ఎన్నికలసంఘం పెట్టిన డెడ్ లైన్ దగ్గర పడిన తర్వాత గానీ వారిలో చలనం రాలేదు. డిసెంబరు 31లోగా వారు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల ప్రకటన చేశారు. ప్రస్తుతానికి రాహుల్ తప్ప.. మరెవ్వరూ నామినేషన్ వేయకపోవచ్చునని అనుకుంటున్నారు. అదే జరిగితే 5వ తేదీకే ఆయనకు అధ్యక్ష పదవి దక్కుతుంది. కీలకమైన గుజరాత్ ఎన్నికలకు ముందే.. ఆయనకు అధ్యక్ష పదవి వస్తుంది.. అంటూ అదేదో పెద్ద తురుపుముక్క పరిణామం లాగా చెప్పుకుంటున్నారు.

రాహుల్ కు కిరీటం వస్తే.. గుజరాత్ ఎన్నికలపై దాని ప్రభావం ఉంటుందా? కేవలం ఆయన పార్టీ అధ్యక్షుడు అయినందుకు.. గుజరాత్ ఓటింగ్ సరళి మారుతుందా? అని విశ్లేషకులు భావిస్తున్నారు. మహా అయితే.. పార్టీ గెలిస్తే.. ఆయన కిరీటధారణ ముహూర్తబలం అంటూ  కీర్తించుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. అంతే తప్ప- గుజరాత్ ఎన్నికల్లో గనుక ఓటమి చవిచూడాల్సి వస్తే.. రాహుల్ అధ్యక్షుడి కిరీటం ధరించిన ముహూర్త బలం అపశకునం పలకరించిందని, తొలుతే ఓటమితో శ్రీకారం చుట్టవలసి వచ్చిందని అనుకోడానికి తప్ప మరో తేడా రాదు. మొత్తానికి కాంగ్రెస్ లో ఇక యువరాజు శకం మొదలవుతోంది. ఇన్నాళ్లూ ఇటలీ మహిళ కనుసన్నల్లో దేశాన్ని పాలించేస్థాయి పార్టీ ఉన్నదంటూ ఒక  కేటగిరీ విమర్శలు చేస్తూ బతికిన వాళ్లంతా ఇప్పుడు కొత్త విమర్శలను సిద్ధం చేసుకుంటే సరిపోతుంది.
Tags:    

Similar News