తెలంగాణలోకి రాహుల్ గాంధీ పాదయాత్ర ఎంట్రీ.. రేవంత్ కు ఇది పరీక్షా?

Update: 2022-10-23 04:53 GMT
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ చేపట్టిన రాహుల్ గాంధీ జోడో పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించింది. ఏపీలో ముగిసిన అనంతరం తెలంగాణలోకి రాహుల్ ఎంట్రీఇచ్చాడు. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ వద్ద  కృష్ణా నది బ్రిడ్జి మీదుగా రాస్ట్రంలో రాహుల్ పాదయాత్ర ప్రారంభమైంది. నవంబర్ 8వ తేదీ వరకూ ఇది కొనసాగుతుంది.

తెలంగాణలో రాహుల్ గాంధీ మొత్తం 370 కిలోమీటర్లు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు రూట్ మ్యాప్ ఖరారైంది. తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని మక్తల్ దగ్గర కృష్ణా నది బ్రిడ్జి మీదుగా రాష్ట్రంలో మొదలయ్యే యాత్ర నేడు 13 కిలోమీటర్లు మేర సాగనుంది.

మరిక్కల్ వద్ద తెలంగాణలో తొలి రోజు యాత్రలో భాగంగా రాహుల్ ప్రసంగానికి ఏర్పాట్లు చేశారు. ఆ తర్వాత శంషాబాద్ నుంచి ఢిల్లీ వెళతారు. దీపావళి కావడంతో మూడు రోజుల పాటు యాత్రకు విరామం ప్రకటించారు. 26వ తేదీన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ప్రమాణ స్వీకారం తర్వాత రాహుల్ గాంధీ తిరిగి తెలంగాణకు వస్తారు. 27వ తేదీ ఉదయం నుంచి తెలంగాణలో తిరిగి యాత్ర కొనసాగుతోంది.

ఈనెల 31న జోడో యాత్ర హైదరాబాద్లోకి ప్రవేశిస్తుంది. హైదరాబాద్ లో చార్మినార్ నుంచి యాత్ర ప్రారంభమై గాంధీబవన్ మీదుగా నెక్లెస్ రోడ్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వరకూ సాగుతుంది. ఇందిర వర్ధంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అదేరోజున నగరంలో రాహుల్ తో కలిసి సోనియా గాంధీ, ప్రియాంక జోడో యాత్రలో పాల్గొంటారని చెబుతున్నారు. దీనిపై అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.

మునుగోడు ఉప ఎన్నికల వేళ రాహుల్ పాదయాత్ర టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే అటు మునుగోడును గెలిపించాలి.. ఇటు రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేయాలి. రేవంత్ సమర్థతకు ఈ రెండూ పరీక్షగా మారాయి. రాహుల్ యాత్రకు ఇప్పటివరకూ నిర్వహించిన ప్రాంతాల్లో అనూహ్య స్పందన వచ్చింది. తెలంగాణలో వచ్చే ఎన్నికలకు ఈ యాత్ర పార్టీ శ్రేణుల్లో జోష్ పెంచుతుందని ఆశిస్తున్నారు.  ఇప్పటికే దీనికి సంబంధించి పార్టీ పలు కమిటీలను ఏర్పాటు చేసింది.

పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణికం ఠాగూర్ తోపాటు వేణుగోపాల్ స్వయంగా తెలంగాణలో రాహుల్ యాత్ర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా ఉన్న రాజకీయాలను రాహుల్ పాదయాత్ర ఎంత మేరకు మారుస్తుందన్నది వేచిచూడాలి.
Tags:    

Similar News