`భార‌త్ జోడో` దారి త‌ప్పిందా? నిపుణుల మాట ఇదే!

Update: 2022-09-11 13:35 GMT
అదేంటి.. కాంగ్రెస్ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన భార‌త్ జోడో యాత్ర ఇంకా నాలుగు రోజులు కూడా గ‌డ‌వ‌కుండానే.. ఇలా అంటున్నారేంటి? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? ఔను.. ఇది దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ నిపుణులు, విశ్లేష‌కులు చెబుతున్న‌మాట‌. భార‌త్ జోడో యాత్ర దారిత‌ప్పింద‌ని చెబుతున్నారు. దీనికి కార‌ణాలు కూడా వారు పేర్కొంటున్నారు. అస‌లు భార‌త్ జోడో యాత్ర ల‌క్ష్యం ఏంటి? అనేది ఇప్పుడు ప్ర‌స్తావ‌నార్హం.

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు అవ‌లంభిస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై ఉద్య‌మించ‌డ‌మే ల‌క్ష్యం గా రాహుల్ ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 3500 కిలో మీట‌ర్ల మేర ఆయ‌న ప‌ర్య‌టించి.. ప్ర‌జ‌ల కు మోడీ స‌ర్కారు విధానాల‌ను వివ‌రించి.. వారిని త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేయాలని ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. దీనికిగాను కాంగ్రెస్ అధిష్టానం నుంచి కిందిస్థాయి వ‌ర‌కు కూడా అనేక క‌స‌ర‌త్తులు జ‌రిగాయి. క‌న్యాకుమారి నుంచి క‌శ్మీర్ వ‌ర‌కు ఈ పాద‌యాత్ర‌ను నిర్వ‌హించ‌నున్నారు.

అయితే.. ఈ రూట్ మ్యాప్‌లో పేర్కొన్న రాష్ట్రాల‌పై ఇప్పుడు రాజ‌కీయ విశ్లేష‌కులు, నిపుణుల నుంచి అభ్యం త‌రాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. బీజేపీకి వ్య‌తిరేకంగా ఉన్న రాష్ట్రాల్లోనే ఈ యాత్ర సాగుతోంద‌ని.. అస‌లు ఈ యాత్ర సాగే కొన్ని రాష్ట్రాల్లో అస‌లు బీజేపీకి ఉనికే లేద‌ని.. చెబుతున్నారు. అలాంట‌ప్పుడు రాహుల్ ఇంత ప్ర‌యాస ప‌డి.. ఈ యాత్ర చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు త‌మిళ‌నాడులో దీనిని ప్రారంభించారు. ఇక్క‌డ బీజేపీ ప్ర‌భావం 0.5  ప‌ర్సంట్ మాత్ర‌మే.

ఇక‌, కేర‌ళ‌లో అస‌లు బీజేపీ ఊసే లేదు. అదేవిధంగా ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోనూ నామ‌మాత్ర‌మే, పంజాబ్‌లోనూ అంతంతే. ఇక‌, క‌శ్మీర్‌లో బీజేపీకి అంత సీన్‌లేదు. రాజ‌స్థాన్‌లో ప్ర‌స్తుతం అక్క‌డి ప్ర‌జ‌లు బీజేపీనిదింపేసి కాంగ్రెస్‌కు ప‌గ్గాలు అప్ప‌గించారు. కానీ, ఇప్పుడు జోడో యాత్ర ఈ రాష్ట్రాల మీదుగానే జ‌రుగుతోంది. కానీ, బ‌ల‌మైన బీజేపీ కంచుకోట‌లుగా ఉన్న యూపీ, ఉత్త‌రాఖండ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, క‌ర్ణాట‌క‌(కొంత క‌వ‌ర్ చేస్తున్నారు), మ‌హారాష్ట్ర‌(కొంత వ‌ర‌కు) వంటి రాష్ట్రాల్లో ఈ యాత్ర‌కు చోటు ద‌క్క‌లేదు.

దీంతో రాజకీయ కార్యకర్తల్ని ఏకం చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది త‌ప్ప‌.. బీజేపీపై పోరును తీవ్ర‌త‌రం చేసే ల‌క్ష్యం క‌నిపించ‌డం లేద‌నే వాద‌న వినిపిస్తోంది. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల్ని ప్రధాన ల‌క్ష్యంగా చేసుకుని యాత్ర చేపట్టాల్సిందనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కానీ.. బీజేపీ బలంగా లేని రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ యాత్ర ప్రధానంగా సాగుతోందని, ఇది జోడో యాత్ర అసలు లక్ష్యానికి విరుద్ధంగా కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్ప‌టికైనా.. రూట్ మ్యాప్‌ను మార్చుకునే అవ‌కాశం ఉంద‌ని సూచిస్తున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News