మోడీకి ఆలింగ‌నం షాకిచ్చిన రాహుల్‌

Update: 2018-07-20 09:43 GMT
భార‌త పార్ల‌మెంటులో అద్భుతం చోటు చేసుకుంది. ప్ర‌జాస్వామ్యం గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేయ‌ట‌మే కాదు.. తాను ఇక ఏ మాత్రం అమూల్ బేబీని కాద‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో చేసి చూపించారు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ. రాజ‌కీయ విశ్లేష‌కులు.. కొమ్ములు తిరిగిన మొన‌గాళ్లు లాంటి రాజ‌కీయ దురంధులు సైతం అవాక్కు అయ్యేలా రాహుల్ వ్య‌వ‌హ‌రించారు.

కొన్నేళ్లుగా సాగుతున్న దూకుడు రాజ‌కీయాల వేళ‌.. ప్ర‌ధాన‌మంత్రిని.. అదే స్థానాన్ని కోరుకునే విప‌క్ష నేత ఒక‌రు స్వ‌యంగా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి షేక్ హ్యాండ్ ఇవ్వ‌ట‌మే కాదు.. ప్ర‌ధానికి స్వీట్ షాక్ ఇచ్చేలా ఆలింగ‌నం చేసుకున్న వైనం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానం ఫ‌లితం ఏమైనా కానీ.. ఈ మొత్తం సెష‌న్ కే కాదు.. ఈ మ‌ధ్య కాలంలో ఇలాంటి అద్భుత‌మైన సీన్ ఆవిష్కృతం కాని రీతిలో రాహుల్ రియాక్ట్ అయ్యారు. అప్ప‌టివ‌ర‌కూ ప్ర‌ధాని మోడీ తీరుపైన నిప్పులు చెరిగేలా ప్ర‌సంగించి.. తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేయ‌టమే కాదు.. ఆవేశంతో క‌దిలిపోయిన రాహుల్ గాంధీ త‌న ప్ర‌సంగం పూర్తి అయ్యాక మాత్రం ఎవ‌రూ ఊహించ‌ని ప‌ని చేశారు.

మ‌రింత ఆస‌క్తిక‌ర‌మైన అంశం ఏమంటే.. రాహుల్ ప్ర‌సంగించే వేళ‌.. ఆయ‌న ఆవేశం ధాటికి ఆయ‌న టేబుల్ మీద ఉన్న మంచినీళ్ల గ్లాస్ కింద ప‌డుతుంద‌న్న అనుమానంతో.. ఆయ‌న ప‌క్క‌న కూర్చున్న స‌భ్యుడు ఆయ‌న మంచినీళ్ల గ్లాస్ ను ప‌క్క‌న పెట్టారు. అంత ఉదృతంగా ప్ర‌సంగించిన రాహుల్.. త‌న ప్ర‌సంగం పూర్తి అయిన త‌ర్వాత మోడీ సీటు వ‌ద్ద‌కు వెళ్లారు.

న‌వ్వుతూ ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లిన రాహుల్ ను మోడీ ప‌లుక‌రించి భుజం త‌ట్టారు. రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులైన వీరిద్ద‌రూ అలా వెళ్లి మాట్లాడుకోవ‌టంతో స‌భ‌లోని స‌భ్యులంతా ఆశ్చ‌ర్యంతో చూస్తుండిపోయారు. అప్పుడే అనుకోని చ‌ర్య‌కు దిగారు రాహుల్‌. నా మీద మీలో కోపం.. ద్వేషం ఉన్నాయి.. వాటిని నేను తొల‌గిస్తానంటూ మోడీని ఆలింగ‌నం చేసుకోవ‌టంతో మోడీ అవాక్కు అయ్యే ప‌రిస్థితి నెలకొంది. మోడీని ఆలింగ‌నం చేసుకున్న‌ప్పుడు రాహుల్ మీద మోడీ చేయి వేయ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. అనంత‌రం.. రాహుల్ ను చూసి మోడీ.. భ‌లే అన్న‌ట్లుగా చేయి ఊప‌టం క‌నిపించింది. ఆ త‌ర్వాత నేరుగా త‌న సీటు వ‌ద్ద‌కు వెళ్లి కూర్చున్న రాహుల్ ను కాంగ్రెస్ స‌భ్యులంతా హ‌ర్స‌ద్వానాల‌తో అభినందించారు. ఈ చ‌ర్య ఊహించ‌ని రీతిలో స‌భ‌లోని స‌భ్యులంద‌రిని ఆశ్య‌ర్య‌పోయేలా చేసింది.

వీడియో కోసం క్లిక్ చేయండి


Full View
Tags:    

Similar News