రెండు భారతదేశాలు...పంచ్ మామూలుగా లేదుగా... ?

Update: 2022-02-03 08:35 GMT
అవును కదా సుమీ అని భావించాల్సివస్తోంది ఈ మాటలు చూసి. భారత దేశం ఇపుడు ఎన్నో ముక్కలు తరువాత ఉన్న మేరకు  ఒక్కటిగా ఉంది. అలాంటి దేశంలో మరో దేశమా. అది కూడా రెండు దేశాలా. అఖండ భారత్ ని గట్టిగా కోరుకుంటూ గుండె నిండుగా దేశభక్తిని గాలినే పీలుస్తూ తెల్లారి లేస్తే దేశమాతకు వందనం అర్పించే భక్త  సమాజం ఉలిక్కిపడే మాటే రాహుల్ గాంధీ అనేశారే. మరి వారు మనసులు చివుక్కుమనవా.

అవును, వారు కలత చెందాలి. బాధ పడాలి. కానీ ఆ మాటలు అన్న రాహుల్ గాంధీ మీద కానే కాదు, దేశ భక్తిని టన్నుల కొద్దీ జనాల మెదళ్ళలో జొప్పించి దేవాలయ భక్తితో పాటు దాన్ని రంగరించి ఎక్కడెక్కడి జనాలనూ మెప్పించి గద్దెనెక్కిన పాలకుల మీదనే సొంత భక్త సమాజంవారే  గొంతెత్తాలేమో. అవును బీజేపీ భావజాలాన్ని నిండా మోస్తున్న వారు ఇపుడు ఆలోచించాల్సింది దీని మీదనే.

గుడ్డిగా తమ పార్టీ చెప్పింది కదా అని ఫాలో ఫాలో అనడం కాదు, అసలు దేశం ఏమైపోతోంది. ఎక్కడికి పోతోంది అని ఆలోచన చేయాలి కదా. ఇంతకీ రాహుల్ గాంధీ అన్నదేంటి అని తర్కిస్తే సరిగ్గానే చెప్పారు  కదా అనిపించకమానదు. భారత్ రెండు దేశాలుగా విడిపోయిందని ఆయన అన్నారు. అందులో ఒకటి ధనిక దేశమైతే రెండవది పూట గడవక పస్తుతోతో రోజులు నెడుతున్న కటిక పేద భారత దేశం ఉంది.

ఈ రెండు దేశాలను పాలకులు సృష్టించారు. వారి విధానాల వల్లనే దేశంలో అంతరాలు పెరిగిపోతున్నాయి అని చాలా మంది ఆర్ధిక వేత్తలు కూడా అన్నారు. అదే సమయంలో ఈ దేశంలో పేద వాడు ఎప్పటికీ పేదగా ఉండడమే కాదు నానాటికీ పాతాళానికి దిగజారుతున్నాడు. అదే పెద్దవాడు, ధనవంతుడు పై పైకి ఎగబాకుతున్నాడు.

మరి ఈ తేడాను తగ్గించకపోతే, ఈ అంతరాన్ని పెంచుకుంటూ పోతే కచ్చితంగా భారత్ లో రెండు దేశాలు ఉంటాయి. రాహుల్ గాంధీ అదే చెప్పారు. తాజాగా కేంద్ర బడ్జెట్ మీద ఆయన కామెంట్స్  చేస్తూ ఇలా అన్నారు. దీని మీద కేంద్ర మంత్రులు, బీజేపీ పెద్దలు రాహుల్ మీద విరుచుకుపడుతున్నారు. ఆయనకు ఏం తెలుసు అంటున్నారు.

కానీ తాజాగా పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరి కోసం, ఎందుకోసం అని ఆలోచన చేస్తే కచ్చితంగా రాహుల్ అన్న దాంటో తప్పేముద్ని అనిపించకమానదు, రాహుల్ చెప్పింది కూడా అదే,  కార్పోరేట్లకు, బడా పారిశ్రామికవేత్తలకు,పెద్దలకు బడ్జెట్ లో టోటల్ గా అన్నీ  ఇచ్చారు, అదే టైమ్ లో మధ్యతరగతి వారిని, వేతన‌ జీవులను, పేదలను పూర్తిగా విస్మరించారు అన్నదే రాహుల్ చెప్పిన మాట. ఆయన ఆవేదన వెనక ఉన్న కంటెంట్ ని అర్ధం చేసుకుంటే భారత్ రెండు ముక్కలు చేసారా అని ఆవేశపడాల్సిన అవసర‌మైతే ఎవరికీ  లేదు, మన  ఏలికలు ఈ దిశగా ఆలోచన చేస్తారనే అంతా కోరుతున్నారు, ఆశిస్తున్నారు, భావిస్తున్నారు.


    

Tags:    

Similar News