గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలను ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్న రాహుల్ గాంధీ తీసుకుంటారని ఎప్పటి నుంచో వినిపిస్తున్న వార్తలు ఎట్టకేలకు నిజమైపోయాయి. రోజుల వ్యవధిలోనే ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ మేరకు నేటి ఉదయం పార్టీ అధినేత్రి - రాహుల్ తల్లి సోనియా గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక భేటీ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని పాస్ చేసేసింది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ నుంచి ఆ బాధ్యతలను రాహుల్ గాంధీకి బదలాయించాలని పార్టీలో అత్యున్నత విభాగమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు పార్టీ నుంచి విస్పష్ట ప్రకటన కూడా జారీ అయిపోయింది.
త్వరలో జరగబోయే పార్టీ అధ్యక్ష ఎన్నిక తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ ఎన్నిక కూడా లాంఛనమేనని చెప్పాలి. ఎందుకంటే... సీడబ్ల్యూసీ ఎంపిక చేసిన అభ్యర్థే పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ అభ్యర్థి కాకుండా మిగిలిన ఏ ఒక్కరు కూడా పోటీకి దిగే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. ఇలా పార్టీ అధ్యక్ష పదవి కోసం ఇద్దరు వ్యక్తులు పోటీ పడిన దాఖలా ఇప్పటిదాకా లేదనే చెప్పాలి. సీడబ్ల్యూసీ నిర్దేశానికి అనుగుణంగానే జరిగే ఎన్నికల్లో రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు దఖలు పడటంలో ఎలాంటి సందేహం ఏ ఒక్కరికి కూడా లేదనే చెప్పాలి. 2013 నుంచి పార్టీకి ఉపాధ్యక్షుడిగా కొనసాగుతూ వస్తున్న రాహుల్ గాంధీ... గడచిన రెండేళ్ల నుంచి పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు చేపడతారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తలన్నీ వినిపించినట్లే వినిపించి మాయమైపోతున్నాయి. కొన్ని సందర్భాల్లో రాహుల్ గాంధీకి ఇష్టం లేదని, మరికొన్ని సార్లు ఇంకేవో కారణాలంటూ ఈ వార్తలు తేలిపోయాయి.
అయితే ప్రస్తుతం గుజరాత్‌లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా పరిణతి చెందిన రాజకీయ వేత్తగా కొత్తగా కనిపిస్తున్న రాహుల్ గాంధీ... అదే సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడుతుండటం గమనార్హం. అంటే... రాహుల్‌లో ఈ పరిణతి చూసే సీడబ్ల్యూసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగానూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటిదాకా పార్టీకి సుదీర్ఘ కాలం పాటు అధ్యక్షురాలిగా కొనసాగిన రికార్డు సోనియా గాంధీ పేరిటే ఉంది. 1998 నుంచి పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా... ఇప్పుడు ఆ పదవిని తన కుమారుడు రాహుల్ గాంధీకి అప్పగించేసి దిగిపోతున్నారు. ఇదిలా ఉంటే... గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కందాలపై పెట్టుకున్న రాహుల్ గాంధీ ఇప్పటిదాకా పార్టీ ఉపాధ్యక్షుడి హోదాలోనే ముందుకు సాగుతున్నారు. ఇక గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు చేపట్టేస్తారన్న మాట. అంటే... యువరాజుగా గుజరాత్ లో కాలుమోపిన రాహుల్... అక్కడి ఎన్నికలు పూర్తయ్యే నాటికి రాజుగా తిరిగి వెళ్లిపోతారన్న మాట.