రాహుల్ తేల్చ‌రు.. పార్టీ నిర్ణ‌యం తీసుకోదు!

Update: 2019-06-21 05:28 GMT
నాయ‌కుడి స్థైర్యం తెలిసేదెప్పుడు?  పీక‌ల్లోతు ప‌రాజ‌యంలో కూరుకుపోయిన‌ప్ప‌డు త‌న చుట్టూ వారిలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చి క‌ద‌నోత్సాహంతో విజ‌యం దిశ‌గా అడుగులు వేసిన‌ప్పుడే. గాంధీ కుటుంబానికి క‌ట్టుబానిస‌త్వం చేసేలా కాంగ్రెస్ నేత‌లు మారిపోయిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడా పార్టీలో గాంధీ ఫ్యామిలీకి ప్ర‌త్యామ్నాయంగా దేశం మొత్తానికి తెలిసిన నేత ఎవ‌రైనా ఉన్నారంటే ఎవ‌రూ లేర‌న్న స‌మాధానం రాక మాన‌దు.

ఇంత‌లా నాయ‌క‌త్వ లేమితో త‌ల్ల‌డిల్లిపోతున్న పార్టీకి.. ఎవ‌రూ అడ‌గ‌కుండానే నైతిక బాధ్య‌త వ‌హిస్తూ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన రాహుల్ తీరుతో ఇప్పుడా పార్టీ కిందామీదా ప‌డుతోంది. సార‌థి లేని పార్టీలో ఏం చేయాలో.. ఎటు అడుగు వేయాలో అర్థం కాక స‌త‌మ‌త‌మ‌వుతోంది. మీరు అలా ఉండండి చాలు.. పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేయొద్ద‌ని పార్టీ నేత‌లు కోరుకుంటున్నా.. రాహుల్ మాత్రం నో అనేస్తున్నారు.

గ‌తంలో మాదిరి టీక‌ప్పుడు తుఫాన్లు సృష్టించే కాంగ్రెస్ నేత‌ల‌కు భిన్నంగా ఆయ‌న తీరు ఉంది. మాట అంటే మాటే. ఒక్క‌సారి ఫిక్స్ అయ్యాక ఎవ‌రిమాట వినేది లేద‌న్న‌ట్లుగా ఉన్న‌రాహుల్ కార‌ణంగా ఇప్పుడేం చేయాలో దిక్కుతోచ‌ని స్థితిలోకి కాంగ్రెస్ చిక్కుకుపోయింది. పార్టీ త‌దుప‌రి అధ్య‌క్షుడు ఎవ‌ర‌న్న‌ది రాహుల్ డిసైడ్ చేయాల‌న్న‌ట్లుగా కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు చెబుతుంటే.. మ‌రోవైపు రాహుల్ మాత్రం.. అధ్య‌క్షుడ్ని పార్టీ నిర్ణ‌యిస్తుంది.. నేను కాదంటున్నారు.  దీంతో కాంగ్రెస్ అధ్య‌క్షుడ్ని నిర్ణ‌యించే బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.

ఇలాంటివేళ‌.. పార్టీ అధ్య‌క్షుడిగా గెహ్లాట్ ఎంపిక కానున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. హ‌మ్మ‌య్య‌.. మొత్తానికి కాంగ్రెస్ బండి న‌డిపించేటోడు దొరికాడ‌న్న మాట అని ఊపిరి పీల్చుకునేంత‌లో రాహుల్ మ‌రో ఆస‌క్తిక‌ర అంశాన్ని వెల్ల‌డించారు. పార్టీ అధ్య‌క్షుడ్ని నిర్ణ‌యించేది తాను కాద‌ని.. అశోక్ గెహ్లాట్ త‌దుప‌రి అధ్యక్షుడు అయ్యేందుకు తాను అనుమ‌తి తెలిపాన‌ని చెప్ప‌టంలో అర్థం లేద‌ని చెబుతున్నారు. బ‌య‌ట ప్ర‌చారం జ‌రుగుతున్న‌వ‌న్నీ అబ‌ద్ధాల‌ని.. పార్టీనే త‌దుప‌రి అధ్య‌క్షుడ్ని ఎన్నుకుంటుంద‌ని పాత పాట మొద‌లెట్టారు రాహుల్. నిరాశ‌లో కూరుకుపోయిన వేళ‌.. త‌న‌ను న‌మ్ముకున్న వారిలో కొత్త ఆశ‌ల్ని.. ఆకాంక్ష‌ల్ని తీసుకొచ్చే చేయాల్సిన నాయ‌కుడు.. కోర‌కుండానే అస్త్ర‌స‌న్యాసం చేయ‌టం రాహుల్ లాంటి వారికే చెల్లుతుంది.
Tags:    

Similar News