అన్ని పార్టీలు క‌లిస్తేనే ఏపీకి న్యాయం-రాహుల్‌

Update: 2018-02-09 08:46 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోరాటంలో బీజేపీ పార్టీ క్ర‌మంగా ఒంట‌రిగా మారుతోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు లేశ‌మాత్ర‌మైనా ప‌ట్టించుకోని బీజేపీపై ప్ర‌జ‌లు - రాజ‌కీయ నేత‌లు ఏపీలోని ప్ర‌తి ఒక్క‌రూ క‌న్నెర్ర చేస్తుంటే... దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోంది ఇపుడు. ఇప్ప‌టికే జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఆదాయ వ‌న‌రులు లేక ఆర్థికంగా అనాథ అయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక నిధులు ప‌క్క‌న పెడితే క‌నీసం హామీ ఇచ్చిన నిధులు కూడా ఇవ్వ‌డంలో కేంద్రం చూపిన తాత్సారంపై ఏపీ క‌దిలింది. ధ్వ‌జ‌మెత్తింది. నిర‌స‌న జ్వాల‌ను ర‌గిలించింది. కానీ బీజేపీ మాత్రం చేస్తున్నాం క‌దా అని మొండికేస్తోంది.

ఈ పోరాటానికి తెలంగాణ ఎంపీ క‌విత కూడా నిన్న మద్ద‌తు ప‌లికిన విష‌యం తెలిసిందే. తాజాగా రాహుల్ గాంధీ ట్విట్ట‌రులో త‌న మ‌ద్ద‌తు ప‌లికారు. *కాంగ్రెస్ పార్టీ ఏపీ డిమాండ్ల‌ను న్యాయ‌మైన‌విగా భావిస్తోంది. అందుకే ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల డిమాండ్ల‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తోంది. పోల‌వ‌రాన్ని వెంట‌నే పూర్తి చేయ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ కు ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించాల్సిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంది. అన్ని పార్టీలు క‌ల‌సి ఏపీ కోసం పోరాడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది* అని ట్విట్ట‌రులో పేర్కొన్నారు. ఆయ‌న చేసిన ట్వీటును కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్ట‌రు అక్కౌంటు కూడా రీట్వీట్ చేసింది. ఐఎన్ ఎస్ స్టాండ్స్ విత్ ఆంధ్ర # ట్యాగుతో రాహుల్ ఈ ట్వీట్ చేశారు.

ఉద‌యం ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి కూడా మాట్లాడారు. బీజేపీ-టీడీపీ క‌లిసి రాష్ట్రాన్ని మోసం చేస్తున్నాయ‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీ-వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాడితేనే కేంద్రం దిగివ‌స్తుంద‌న్నారు. ఇరుపార్టీలు పూర్తిగా మోడీపై మోజు త‌గ్గించుకోవాల‌ని ర‌ఘువీరా సూచించారు. అయితే, ర‌ఘువీరా ఇంత లేటుగా నిద్ర‌లేచారు ఎందుకో మ‌రి. ఒక్క కేవీపీ మాత్ర‌మే ఏపీ డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. కాంగ్రెస్‌ లో రాజ్య‌స‌భ స‌భ్యులు తెలుగు వాళ్లున్నా ఇంత‌కాలం స్పందించింది లేదు. కానీ ఈరోజు నిద్ర‌లేచిన ర‌ఘువీరా ఇత‌ర పార్టీల‌కు మాత్రం సుద్దులు చెబుతున్నారు.
Tags:    

Similar News